డయాగ్నసిస్ సరిలేని చికిత్సతో ఏంలాభం?

రోగం తగ్గాలంటే.. ఆ రోగానికి కారణం ఏమిటో సరిగ్గా గుర్తించాలి. కారణం ఏమిటో తెలియకుండా, దాని మూలం ఎక్కడున్నదో గుర్తించకుండా.. చికిత్స చేసుకుంటూ వెళితే.. రకరకాల చికిత్సలు చేయాల్సి వస్తుంది సరికదా.. రోగం మరింతగా…

రోగం తగ్గాలంటే.. ఆ రోగానికి కారణం ఏమిటో సరిగ్గా గుర్తించాలి. కారణం ఏమిటో తెలియకుండా, దాని మూలం ఎక్కడున్నదో గుర్తించకుండా.. చికిత్స చేసుకుంటూ వెళితే.. రకరకాల చికిత్సలు చేయాల్సి వస్తుంది సరికదా.. రోగం మరింతగా ముదిరే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీని గమనిస్తే.. అదే అనిపిస్తోంది.

కేసీఆర్ ను మట్టి కరిపించి తాము అధికారంలోకి వస్తాం అని విర్రవీగిన పార్టీ.. చివరికి కేవలం ఎనిమిది సీట్లను మాత్రమే గెలుచుకుని దారుణ పరాభవానికి గురైంది. పార్టీ తరఫున కొమ్ములు తిరిగిన నాయకులుగా చెప్పుకునే వాళ్లందరూ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. తీరా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు చేతిలో ఉన్నన్ని సీట్లనయినా తిరిగి నిలబెట్టుకోవాలంటే.. అందుకు అవసరమైన కసరత్తును భాజపా ప్రారంభించింది.

10 నుంచి 15 ఎంపీ సీట్లు తెలంగాణలో గెలుస్తామని అంటున్న బిజెపి నాయకుల అతిశయమైన డైలాగులను ప్రజలు నమ్మడం లేదు. అయితే పార్టీని విజయం దిశగా పునర్ వ్యవస్థీకరించే వారి ప్రయత్నాలే ఆశ్చర్యం గొలుపుతున్నాయి.

భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించింది. రెండునెలల కిందట విజయం కోసం పోరాడిన ఈ పార్టీ ఇప్పుడు సారథులను మార్చడం అంటే ఆశ్చర్యమే. ఎందుకంటే.. ఇప్పుడు సారథులు అయిన వారే.. నిజంగా పార్టీని విజయం వైపు నడిపిపంచగల సమర్థులు అనే నమ్మకం పార్టీకి ఉంటే గనుక ఇన్నాళ్లు ఎందుకు ఉపేక్షించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పగ్గాలు వారి చేతిలోనే పెట్టిఉండొచ్చు కదా. ‘గెలవలేకపోయాం సరే.. రాష్ట్రంలో మా ఓటుశాతం రెట్టింపు అయింది’ అంటూ ఆత్మవంచనతో కూడిన మాటలు వల్లించాల్సిన అవసరం ఉండేది కాదు కదా.. అనేది జనాభిప్రాయం.

భారాసతో లోపాయికారీ ఒప్పందం కారణంగా బిజెపి అసెంబ్లీ ఎన్నికలను లైట్ తీసుకున్నదని, ఇప్పుడు వారికి ఎంపీ ఎన్నికలు ప్రయారిటీ గనుక, లోక్ సభలో 400 సీట్లను గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంటున్నారు గనుక.. పార్టీకి సరైన సారథులను ఎంపిక చేయాలని కసరత్తు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా.. పార్టీని ఎంతో దూకుడుగా ముందుకు తీసుకువెళుతున్న బండి సంజయ్ ను హఠాత్తుగా తప్పించి, కిషన్ చేతిలో పగ్గాలు పెట్టడం.. కేసీఆర్ కు మేలు చేయడానికేనని నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు. ఆ పార్టీ వారిలోనే ఇలాంటి వ్యాఖ్యలు మనకు వినిపిస్తుంటాయి.

ఉత్తినే జిల్లా అధ్యక్షులను మార్చి చేతులు దులుపుకోవడం, చోద్యం చూడడం కాకుండా.. బిజెపి ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో పరువు దక్కించుకోవాలనుకుంటే.. రాష్గ్ర సారథిని కూడా మారిస్తే తప్ప సాధ్యం కాదనే వాదన కూడా పార్టీలో ఉంది. అందుకే, ఓటమికి దారితీసిన అసలు లోపం ఎక్కడున్నదో సరిగా డయాగ్నసిస్ చేయకుండా జిల్లా అధ్యక్షుల మార్పుతో చికిత్సలు ప్రారంభించారని కార్యకర్తలు అనుకుంటున్నారు.