కేటీఆర్ మాటల అంతరార్థం వేరే ఉందా?

‘వందరోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటారు’, ‘ఆరునెలల్లో ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడతారు’, ‘ఈప్రభుత్వం తొందరలోనే కూలిపోతుంది, ప్రజలు తిప్పికొడతారు’, ‘ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ప్రజలు విలపిస్తున్నారు’, ‘వాళ్లకు మాకు రెండుశాతమే…

‘వందరోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటారు’, ‘ఆరునెలల్లో ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడతారు’, ‘ఈప్రభుత్వం తొందరలోనే కూలిపోతుంది, ప్రజలు తిప్పికొడతారు’, ‘ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ప్రజలు విలపిస్తున్నారు’, ‘వాళ్లకు మాకు రెండుశాతమే ఓట్ల తేడా’, ‘నాలుగుకోట్ల మంది ప్రజలున్న తెలంగాణ మాకంటె వాళ్లకు నాలుగులక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి.. ఈతేడాను దాటేస్తాం’.. ఇలాంటి అనేక రకమైన మాటలు భారాస నాయకులు ప్రధానంగా కేటీఆర్ నుంచి మనం ప్రతిరోజూ వింటూ ఉన్నాం.

తాము ఓడిపోయి, రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, ఓర్వలేక నానా మాటలు అంటున్నారని అనిపిస్తుండేది. కానీ తాజా రాజకీయ పరిణామాలు గమనించినప్పుడు కేటీఆర్ మాటల అంతరార్థం వేరే ఉన్నదని అనిపిస్తుంది.

కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత.. క్షేత్రస్థాయిలో భారాస భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నది. భారాస కేతనం ఎగురుతున్న మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పుడుతున్నాయి. పురపాలికలు కాంగ్రెస్ వశం అవుతున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపు మీద కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఫోకస్ పెట్టడం లేదు. అవి ఇంకా మొదలు కాలేదు. కానీ అలాంటి ఫిరాయింపులు జరగకుండా ఉంటాయనే నమ్మకం భారాసకు లేదు.

2018 ఎన్నికల తర్వాత ఏకంగా 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను తమలో కలిపేసుకున్న భారాస పాటించిన రాజనీతిని కాంగ్రెస్ అనుసరించకుండా ఎందుకుంటుంది? వారు నేర్పిన పాఠాన్ని తిరిగి అప్పజెప్పకపోతే ఎలాగ?

భారాసకు చెందిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లతో కాంగ్రెసు ప్రభుత్వ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కావడాన్ని కూడా సీరియస్ గానే పరిగణించాలి. వారు ఎంతగా గౌడ ధార్మిక సంస్థ కార్యకలాపాల కోసం కలిసినట్టుగా చెబుతున్నప్పటికీ.. రాజకీయ ప్రాధాన్యం ఈ భేటీకి ఉండదని అనుకోలేం.

ఇలాంటి సమయంలో.. తమ పార్టీ నాయకులు ఎవరైనా కాంగ్రెసు వైపు చూస్తుంటే గనుక.. వారిని ఇండైరక్టుగా బెదిరించడానికి కేటీఆర్ పైన గుర్తుచేసుకున్న డైలాగులు అన్నింటినీ కేటీఆర్ పదేపదే వల్లిస్తున్నారేమో అనిపిస్తోంది.

కాంగ్రెస్ కు మాకు ఉన్న తేడా తక్కువ.. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం అని అనడం ద్వారా.. ఈ పార్టీని వదలి అటు వెళ్లారంటే తర్వాత మీ భరతం పడతాం.. అని ఫిరాయింపు ఆలోచనలున్న వారిని హెచ్చరించడానికే అంటున్నట్టుగా కనిపిస్తోంది. పాపం.. పదేళ్లు అప్రతిహతంగా ఏలిన వారికి ఒక్క ఓటమితో పార్టీని కాపాడుకోవడానికి నానా కష్టాలు ఎదురవుతున్నట్టున్నాయి.