ఉత్తరాంధ్రా నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరిస్తారు అని ఆ పార్టీ ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. ఉత్తరాంధ్రకు ముఖ ద్వారం అయిన విశాఖ జిల్లా భీమునిపట్నంలో జగన్ ఈ నెల 25న ఎన్నికల సమరానికి తెర తీస్తారు.
భీమునిపట్నంలో వైసీపీ ప్లీనరీని తలదన్నేలా భారీ ఎత్తున పార్టీ ప్రతినిధులు క్యాడర్ తో సభని నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రతీ నియోజకవర్గం నుంచి అయిదారు వేల మందికి తగ్గకుండా కార్యకర్తలు హాజరవుతారని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు.
లక్షలాది మందితో నిర్వహించే ఈ సభ అధికార వైసీపీ ఎన్నికల సన్నాహాలకు సంసిద్ధం అని తెలియచేసే విధంగా ఉంటుందని అంటున్నారు పార్టీకి చెందిన క్రియా శీల కార్యకర్తలతో జగన్ ఈ సభ ద్వారా నేరుగా సమావేశం అవుతారని అంటున్నారు.
వారిలో ఉన్న అసంతృప్తిని తొలగించడంతో పాటు పార్టీ విధానాలను వారికి వివరించడం దిశా నిర్దేశం చేయడం చేస్తారు అని అంటున్నారు. అలాగే కొన్ని చోట్ల అభ్యర్ధులను మార్చారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది నేరుగా క్యాడర్ కే అర్ధం అయ్యేలా జగన్ చెబుతారు అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అన్న నినాదాన్ని క్యాడర్ కి వివరించి ప్రజలలోకి బలంగా దాన్ని ఎలా తీసుకుని పోవాలలో పార్టీ అధినేత హోదాలో జగన్ వివరిస్తారు అని అంటున్నారు. ఈ సభతో ఉత్తరాంధ్రా నుంచి శుభారంభం పలికిన జగన్ ఆ మీదట ఏపీ అంతటా అయిదు ప్రాంతీయ సభలు సదస్సులను వరసగా నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.