వైసీపీలో టికెట్ల గోల నడుస్తోంది. 60 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీలో అయోమయం నెలకుంది. తిరుపతి జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి కిలివేటి సంజీవయ్య వరుసగా రెండోసారి గెలుపొందారు. భారీ మెజార్టీ రావడమే సంజీవయ్య పాలిట శాపమైంది. ఇదంతా తన బలమే అనుకున్న సంజీవయ్య, తనను గెలిపించిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను చావ బాదించారు.
బహుశా ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయని ఆయన మరిచిపోయినట్టున్నారని సూళ్లూరుపేట వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. ఇంతకాలం ఎమ్మెల్యే ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల కాలం వచ్చింది. సంజీవయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే ఓడించి తీరుతామంటూ సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
ఇప్పటికే పలుమార్లు సంజీవయ్యకు టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించి డిమాండ్ చేసింది. ఈ క్రమంలో గురువారం దొరవారిసత్రంలో వైసీపీ నాయకుడికి చెందిన తోటలో భారీ సంఖ్యలో అసమ్మతి వర్గీయులంతా సమావేశమయ్యారు.
సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్‌రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, వైసీపీ రాష్ట్ర కార్మిక నాయకుడు కట్టా సుధాకర్‌రెడ్డి, సూళ్లూరుపేట పట్టణ వైసీపీ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి, రైతు విభాగం నాయకులు కె.రామ్మోహస్రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్న ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరైన వైసీపీ శ్రేణులు ముక్త కంఠంతో… సంజీవయ్య వద్దు.. జగనన్న ముద్దు నినాదాలతో హోరెత్తించాయి.
వైసీపీ శ్రేణుల అభిప్రాయాలకు విరుద్ధంగా సంజీవయ్యకు టికెట్ ఇస్తే, తామే ఓడిస్తామని తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. అందుకే ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మర్యాదగా నడుచుకోండయ్యా అని వేడుకున్నా, వినిపించుకోని పాపానికి ఇప్పుడు మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైందనే చర్చ జరుగుతోంది.