దర్శకుడు వీఐ ఆనంద్ సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కాస్త సైన్స్-ఫిక్షన్, ఇంకాస్త థ్రిల్, మరికాస్త ఊహకందని ఫాంటసీ జోడిస్తూ సినిమాలు తీస్తుంటాడు. ఇప్పుడీ డైరక్టర్ కర్మ సిద్దాంతాన్ని బేస్ చేసుకొని సినిమా తీసినట్టు కనిపిస్తోంది.
సందీప్ కిషన్ హీరోగా ఊరు పేరు భైరవకోన అనే సినిమా తీశాడు వీఐ ఆనంద్. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ గ్రిప్పింగ్ గా, ఎప్పట్లానే వీఐ ఆనంద్ మార్క్ లో ఉంది. మంచి లవ్ సీన్ తో ట్రయిలర్ ను స్టార్ట్ చేసిన దర్శకుడు, వెంటనే భైరవకోన అనే ఫిక్షనల్ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.
గరుడ పురాణంలో మాయమైన ఆ 4 పేజీల్నే భైరవకోనగా చూపించిన దర్శకుడు.. అతీంద్రియ శక్తులున్న ఓ దండాన్ని ట్రయిలర్ లో చూపించాడు. దాంతో హీరో కొన్ని మేజిక్స్ చేసినట్టు కూడా చూపించాడు. అయితే సినిమాలో అంతకుమించి ఏదో ఉందనే విషయం హీరోయిన్ పాత్రలతో పాటు, ఇతర సన్నివేశాలు చూస్తే అర్థమౌతోంది.
ట్రయిలర్ లో విజువల్స్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈ ట్రయిలర్ తో సినిమాపై సరైన అంచనాల్ని సెట్ చేశాడు దర్శకుడు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఊరు పేరు భైరవకోన మూవీ. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు హీరో సందీప్ కిషన్.