డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నోటి దురుసు ఎక్కువ. ఎవరినైనా ఎంత మాటైనా అనగలరాయన. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైసీపీకి ఆ నియోజకవర్గం కంచుకోట. వైసీపీకి అనుకూల సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. దీంతో ఆ నియోజకవర్గంలో నిలిస్తే చాలు గెలుపు దానికదే నడుచుకుంటూ వస్తుంది. అలాంటి నియోజకవర్గంలో నోటి శుద్ధి లేకపోవడంతో నారాయణస్వామికి కష్టాలు మొదలయ్యాయి.
నారాయణస్వామికి టికెట్ ఇస్తే ఓడిపోతారనే ప్రచారం జరుగుతోంది. వృద్ధాప్యంలో ఉన్న తనకు కాకుండా, కూతురికి టికెట్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. నారాయణస్వామికి జీడీనెల్లూరు టికెట్ ఇవ్వడాన్ని పెండింగ్‌లో వుంచారు. ఈ నేపథ్యంలో తన కార్యకర్తలతో సమావేశమైన నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు టికెట్ రాకపోతే ఆత్మాభిమానాన్ని చంపుకుని జ్ఞానేందర్‌రెడ్డితో కలిసి పని చేసే ప్రశ్నే లేదన్నారు. కాపాడుకోడానికి తనకు ఆస్తులు, అంతస్తులు లేవన్నారు. తాను ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. నారాయణస్వామి కామెంట్స్ వైసీపీలో చర్చనీయాంశమయ్యాయి. నిజానికి నారాయణస్వామికి టికెట్ ఇవ్వకూడదని అడ్డుకుంటున్న వ్యక్తులు, శక్తులు వేరే ఉన్నాయి.
సర్వేల ఆధారంగానే టికెట్ ఇస్తానని సీఎం జగన్ పదేపదే అంటున్నారు. జ్ఞానేందర్‌రెడ్డి చెబితే జగన్ విని నారాయణస్వామికి టికెట్ ఇవ్వరా? గెలిచే అవకాశం ఉన్నప్పుడు నారాయణస్వామిని ఎందుకు పోగొట్టుకుంటారు? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తన జిల్లాలో వైసీపీని గుప్పిట్లో పెట్టుకున్న పెద్దలతో పాటు సీఎం జగన్‌పై మాట్లాడే దమ్ము లేక, ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డ చందంగా… జ్ఞానేందర్‌రెడ్డిపై నారాయణస్వామి అక్కసు వెళ్లగక్కుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిట్టాల్సినోళ్లను తిడితే అటోఇటో తేలిపోతుంది. అది వదిలేసి పబ్లిసిటీ కోసం నారాయణస్వామి ఎప్పట్లాగే నోరు పారేసుకోవడం గమనార్హం.