స‌మీక్ష‌కుల్ని తిడితే సినిమాలు ఆడ‌వు

నా సామీరంగ‌ సినిమాపై ఒక ప్రేక్ష‌కుడిగా అభిప్రాయం రాశాను. అది స‌మీక్ష కాదు. అయినా ర‌క‌ర‌కాల కామెంట్స్ వ‌చ్చాయి. ఎవ‌రి సంస్కారం కొద్ది వాళ్లు మాట్లాడారు. వాటికి జ‌వాబు కాదు కానీ, కొన్ని విష‌యాలు…

నా సామీరంగ‌ సినిమాపై ఒక ప్రేక్ష‌కుడిగా అభిప్రాయం రాశాను. అది స‌మీక్ష కాదు. అయినా ర‌క‌ర‌కాల కామెంట్స్ వ‌చ్చాయి. ఎవ‌రి సంస్కారం కొద్ది వాళ్లు మాట్లాడారు. వాటికి జ‌వాబు కాదు కానీ, కొన్ని విష‌యాలు చెప్ప‌టం అవ‌స‌రం.

వినియోగ‌దారుల‌కి ఎలాగైతే హ‌క్కులుంటాయో, అలాగే ప్రేక్ష‌కుల‌కి కూడా కొన్ని హ‌క్కులు వుంటాయి. మా ఇష్టం వ‌చ్చింది తీస్తాం, మీరు నోర్మూసుకుని వుండండి అంటే కుద‌ర‌దు. నోరు తెరుస్తారు, మూయిస్తారు. డ‌బ్బులిచ్చి కొనుక్కున్న వినోదం నిరాశ ప‌రిస్తే మాట్లాడే హ‌క్కు వుంటుంది. మాట్లాడాలి కూడా.

ఈ మ‌ధ్య ఒక రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేస్తే, దానికి ప్ర‌చారం చేసిన సినిమా హీరోని కూడా కోర్టుకి లాగారు. ఎందుకంటే అత‌ను సెల‌బ్రిటీ కాబ‌ట్టి. చెప్పింది జ‌నం న‌మ్మారు. అలాగే మ‌న హీరోల‌కి ఫ‌స్ట్ కాపీ చూడ‌గానే సినిమాలో ఏముందో తెలిసిపోతుంది. తెలియ‌క‌పోతే అత‌ని అనుభ‌వం వృథా. తెలిసి కూడా ప్ర‌మోష‌న్‌లో అద్భుతం అని చెప్తారు. అది కూడా త‌ప్పు కాదు. ఓపెనింగ్స్ కోసం త‌ప్ప‌దు.

సినిమా కూడా ఒక ప్రాడ‌క్ట్ కాబ‌ట్టి అంద‌మైన రేప‌ర్ వేసి, క‌బుర్లు చెప్పి అమ్ముతారు. అయితే రేప‌ర్‌లో ఏమీ లేద‌ని తెలిసి ప్రేక్ష‌కులు తిడితే భ‌రించాలి. అంతే త‌ప్ప‌, తాము అద్భుత‌మైన సినిమా తీస్తే, సమీక్షకులు డ‌బ్బుకి అమ్ముడు పోయి సినిమాని బ్యాడ్ చేశార‌ని బుకాయించ‌కూడ‌దు. తీయ‌డం చేత‌కాక‌, స‌మీక్ష‌కుల మీద ప‌డితే ఏం లాభం?

ప్ర‌పంచ‌మంతా నిర్ధారించిన స‌త్యం ఏమంటే వంద స‌మీక్ష‌లు అద్భుత‌మ‌ని కీర్తించినా చెత్త సినిమాని పైకి లేప‌లేరు. ఘోరం అని రివ్యూలు రాసినా బాగున్న సినిమాని ఆప‌లేరు. మౌత్ ప‌బ్లిసిటీ ల‌క్ష రివ్యూల కంటే ప‌వ‌ర్ ఫుల్‌.

స‌మీక్ష‌కుల‌కి డ‌బ్బులిస్తే పాజిటివ్‌గా రాస్తార‌ని, ఇవ్వ‌క‌పోతే నెగెటివ్‌గా రాస్తార‌ని ఒక ఆరోప‌ణ వుంది. అన్ని రంగాలు అర్ధ స‌త్యాల‌తో నిండిపోయాయి. దీనికి జ‌ర్న‌లిజం అతీతం కాదు. డ‌బ్బు తీసుకుని ఓటు వేసేవాళ్లు ఉన్న‌ట్టే, తీసుకోకుండా ఓటు వేసే వాళ్లూ వుంటారు.

అయితే డ‌బ్బుకి విశ్వ‌స‌నీయ‌త‌ని అమ్మ‌డం మొద‌లు పెడితే, త‌ర్వాత డ‌బ్బు , విశ్వ‌స‌నీయ‌త రెండూ వుండ‌వు. అబద్ధాలు రాసే, మాట్లాడే వెబ్‌సైట్స్‌ని , చాన‌ల్స్‌ని గుర్తించ‌లేనంత అమాయ‌కులు కాదు జ‌నం.

అన్నీ నిజాలు వుంటాయ‌న‌డం ఎంత అబ‌ద్ధ‌మో, అన్నీ అబ‌ద్ధాలే వుంటాయ‌న‌డం కూడా అంతే అబ‌ద్ధం.

అబ‌ద్ధాల వ‌ల్ల యావ‌రేజ్ సినిమాలు గ‌ట్టెక్కుతాయి కానీ, బ్లాక్ బ‌స్ట‌ర్లు కావు. మంచి సినిమాలు ప్లాప్ కావు.

స‌మీక్ష‌కులంటే విశ్లేష‌కులే కానీ, సినిమా మేక‌ర్స్ కాదు. నీకు చేత‌నైతే సినిమా తీసి చూపించు అని స‌వాల్ చేస్తూ వుంటారు. సినిమా తీయ‌డం స‌మీక్ష‌కుడి ప‌ని కాదు. మంచి చెడ్డ‌లు వివ‌రించ‌డ‌మే ప‌ని. న‌చ్చే వాళ్ల‌కి న‌చ్చుతుంది. న‌చ్చ‌ని వాళ్ల‌కు న‌చ్చ‌దు.

సంగీతం టీచ‌ర్లు గాన క‌చేరీలు చేయ‌లేరు. అంత మాత్రానా వాళ్ల‌కి సంగీతం గురించి తెలియ‌ద‌ని కాదు.

మ‌నం ఒక ప్ర‌ముఖ హోట‌ల్‌కి వెళ్తాం. బిర్యానీ ఆర్డ‌ర్ చేస్తాం. అది చెత్త‌గా వుంటుంది. మేనేజ‌ర్‌ని పిలిచి ఫిర్యాదు చేస్తాం.

మీకు చేత‌నైతే కిచెన్‌లోకి వ‌చ్చి బిర్యానీ వండి చూపించండి అని స‌వాల్ చేస్తే ఏం చేస్తాం?

దండం పెట్టి వ‌చ్చేస్తాం. లేదా ద‌వ‌డ ప‌గ‌ల కొడ్తాం. డ‌బ్బు పెట్టి కొన్న త‌ర్వాత వ‌స్తువు నాణ్య‌త గురించి ప్ర‌శ్నించే హ‌క్కు వుంటుంది. అయితే ఇక్క‌డ ఒక విష‌యం. సినిమా చూడ‌డం, చూడ‌క‌పోవ‌డ‌మ‌నే ఆప్ష‌న్ ప్రేక్ష‌కుడికి వుంటుంది క‌దా, నిన్నెవ‌రు బొట్టు పెట్టి పిలిచారు?

ఈ దేశంలో సామాన్యుడికి ముఖ్య‌మైన వినోదం సినిమా. ఎన్ని వున్నా, థియేట‌ర్‌లో చూడ‌డంలోని థ్రిల్ వేరు. అభిమానం కావ‌చ్చు, ఆస‌క్తి కావ‌చ్చు. బోలెడు డ‌బ్బులు పోసి సినిమా చూస్తాడు (బెన్‌ఫిట్ షోల‌కైతే వెయ్యి, 2 వేలు కూడా ఇస్తాడు). మ‌రి అత‌ని డ‌బ్బు, టైమ్ విలువ ఏమిటి?

సినిమా అనేది వ్యాపారం అయిన‌ప్పుడు, న‌కిలీ స‌రుకుల్ని ఎవ‌రు గుర్తించాలి? సమీక్ష‌కులదే క‌దా ఆ ప‌ని. విమ‌ర్శ‌ని లాజిక‌ల్‌గా తీసుకుంటే ఆరోగ్యం. సైక‌లాజిక‌ల్‌గా తీసుకుంటే అనారోగ్యం.

జీఆర్ మ‌హ‌ర్షి