పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీ వీడేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అలాంటి నాయకుడితో వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అదే పార్టీకి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా గురువారం భేటీ కావడం చర్చనీయాంశమైంది. పార్థసారథి, జంగా ఇద్దరూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం గమనార్హం. అంతేకాదు ఆయన వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కూడా.
గురజాల టికెట్‌ను జంగా కృష్ణమూర్తి ఆశిస్తున్నారు. అయితే సిటింగ్ ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డిని తిరిగి కొనసాగించడం, ఒకవేళ మార్చాలని అనుకుంటే కొత్త అభ్యర్థిని నిలపాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. జంగాకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇక ఆయన గురించి ఆలోచించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ జంగా సంతృప్తి చెందడం లేదు. తనకు కాసు మహేశ్వరరెడ్డి కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహంగా ఉన్నారు.
కాసును ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇటీవల తన తండ్రికి గురజాల టికెట్ ఇవ్వడానికి సీఎం జగన్ నిరాకరించారనే కోపంతో జంగా కుమారుడు జెడ్పీటీసీ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో జంగా కూడా పార్టీ మారుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరనున్న పార్థసారథితో జంగా కృష్ణమూర్తితో పాటు ఎమ్మెల్యే ఎలీజా కూడా భేటీ కావడంతో పార్టీ మార్పుపై విస్తృత ప్రచారం జరుగుతోంది.
ఎలీజాకు కూడా ఈ సారి టికెట్ ఇవ్వనని జగన్ తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఆయన వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీలో చేరేందుకు పార్థసారథి మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే అనుమానాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.