సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి జూ. ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలకు అదేశించడంతో వెంటనే వాటిని తొలగించారు. దీంతో జూ. ఎన్టీఆర్ అభిమానులు అందోళన వ్యక్తం చేశారు.
ఇవాళ తెల్లవారుజామున జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. వారు వెళ్లిన కాసేపటికి వచ్చిన బాలకృష్ణ.. జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి వాటిని వెంటనే తొలగించాలని హుకుం జారీ చేశారు. వాటిని చూసి 'తీయించెయ్.. వెంటనే తీయించేయ్' అని బాలకృష్ణ టీడీపీ నేతలకు చెప్పడం కూడా వీడియోలో రికార్డ్ అయింది.
కాగా ఇటీవలి కాలంలో టీడీపీ బహిరంగ సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటాలతో ఆయన అభిమానులు సీఎం ఎన్టీఆర్.. సీఎం ఎన్టీఆర్ అంటూ జెండాలు, ప్లెక్సీలతో కనపడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ మౌనంగా ఉండిపోవడంతో చంద్రబాబు సామాజిక మీడియాలో జూనియర్ ఎన్టీఆర్‌పై రకరకలుగా వ్యతిరేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పబ్లిక్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ను బాలకృష్ణ అవమానించారు.
ఇదే విషయంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు నష్టమేమీ లేదని .. వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా మమ్మల్నేం చేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు.