పురందేశ్వ‌రి.. ఇవేం ఆదేశాలు!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి తీరుపై ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆగ్ర‌హంగా ఉన్నారు. వ్య‌క్తిగ‌త విష‌యాల్ని కూడా పార్టీకి సంబంధం ఉన్న‌ట్టు ఆమె భావించి, అంద‌ర్నీ అందులో భాగ‌స్వామ్యం చేయాల‌ని ప‌రిత‌పించ‌డాన్ని…

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి తీరుపై ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆగ్ర‌హంగా ఉన్నారు. వ్య‌క్తిగ‌త విష‌యాల్ని కూడా పార్టీకి సంబంధం ఉన్న‌ట్టు ఆమె భావించి, అంద‌ర్నీ అందులో భాగ‌స్వామ్యం చేయాల‌ని ప‌రిత‌పించ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. ఇవాళ (గురువారం)ఎన్టీఆర్ వ‌ర్ధంతి. రాజ‌కీయాల‌కు అతీతంగా ఎన్టీఆర్ అంటే అభిమానించే వాళ్లే ఎక్కువ‌. అయితే వ్య‌క్తిగ‌త అభిమానం, రాజ‌కీయం వేర్వేరు అనే సంగ‌తిని పురందేశ్వ‌రి మ‌రిచిపోయారు.

ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు బీజేపీ శ్రేణులు నివాళుల‌ర్పించాల‌ని పురందేశ్వ‌రి ఆదేశాలు ఇచ్చిన‌ట్టు ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇందుకు ఎన్టీఆర్‌ జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు అడ్డూరి శ్రీ‌రామ్ ఆదేశాల‌ను ఉద‌హ‌రిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట ఎన్టీఆర్ స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న నంద‌మూరి తార‌క రామారావు విగ్ర‌హానికి గురువారం ఉద‌యం 6 గంట‌ల‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి నివాళుల‌ర్పిస్తార‌ని అడ్డూరి శ్రీ‌రామ్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లంద‌రూ పాల్గొనాల‌ని ఆయ‌న పిలుపు ఇవ్వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఇదే రీతిలో ఏపీలోని అన్ని జిల్లాల బీజేపీ అధ్య‌క్షుల‌కు ద‌గ్గుబాటి సూచ‌న‌ల మేర‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్టీఆర్ వ‌ర్ధంతిని బీజేపీ చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. తండ్రికి ద‌గ్గుబాటి నివాళుల‌ర్పించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌ర‌ని, అయితే రాజకీయంగా ఎన్టీఆర్‌కు బీజేపీకి ఏంటి సంబంధ‌మ‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు నిల‌దీస్తున్నారు. ఇటీవ‌ల ద‌గ్గుబాటి మీడియా స‌మావేశాల్లో త‌న వెనుక దీన‌ద‌యాల్‌, వాజ్‌పేయ్‌, అద్వానీ త‌దిత‌ర నేత‌ల‌కు బ‌దులు ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుని క‌నిపించ‌డాన్ని బీజేపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు.

బీజేపీలో పురందేశ్వ‌రి సొంత ఎజెండాను అమ‌లు చేస్తున్నార‌ని ఆమె బాధ్య‌త‌లు తీసుకున్న మొద‌టి రోజు నుంచి విమ‌ర్శ‌లున్నాయి. తాజాగా ఎన్టీఆర్ వ‌ర్ధంతిని బీజేపీ శ్రేణులు నిర్వ‌హించాల‌నే ఆదేశాల‌తో మ‌రోసారి రుజువైంద‌నే టాక్ వినిపిస్తోంది. ద‌గ్గుబాటి ఆదేశాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వ‌ర్ధంతిని బీజేపీ శ్రేణులు నిర్వ‌హిస్తాయా? లేదా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.