ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏమిటి? జగన్ మీద పంతానికి పోయి కొన్నాళ్లుగా భీష్మించుకుని ఉన్న ఆయన ఇప్పుడు కాస్త మెత్తబడ్డారు. ఇలా మెత్తబడడం వెనుక మర్మం ఏమిటి? ఇంతకూ ఆయన తన పంతం నెగ్గించుకున్నారా? లేదా రాజీపడ్డారా? అనేది అర్థం కావడం లేదు. మొత్తానికి జగన్ మామయ్య బాలినేని మాత్రం తిరిగి ఒంగోలు నియోజకవర్గానికి వెళ్లారు. బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత.. కీలకపరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఒంగోలులో ఇళ్లపట్టాల పంపిణీ కోసం సేకరించిన భూమికి 170 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉందని, ఆ బిల్లులు చెల్లిస్తే తప్ప ఒంగోలులో పోటీచేయను అని బాలినేని శ్రీనివాసరెడ్డి చాలాకాలం కిందటే ప్రకటించారు. ఇళ్లపట్టాలు కేటాయించిన చోట మౌలిక వసతులకు 21 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, పరిహారం సొమ్ము ఇవ్వలేదు. దీంతో బాలినేని అలిగారు.
ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ సొమ్ము రావడం లేదని ఆయన అన్నారు. అదే సమయంలో.. ఒంగోలు ఎంపీ సీటునుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి లేదా ఆయన కొడుకు రాఘవరెడ్డికే టికెట్ ఇవ్వాలనేది.. ఆయన పార్టీ ఎదుట పెట్టిన రెండో డిమాండ్! ఈ రెండు డిమాండ్ల మీద చాలా పట్టుదలగా ఉండిపోయారు. గతంలో మూడురోజులు విజయవాడలోనే ఉండి సీఎం అపాయింట్మెంట్ దొరక్క అలిగి హైదరాబాదు వెళ్లిపోయారు.
బుధవారం ఆయనను మళ్లీ పిలిపించిన జగన్ స్వయంగా మాట్లాడారు. మాగుంట విషయం ప్రస్తావించబోగా.. ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. మాగుంట సంగతి పక్కన పెట్టి.. ఒంగోలులో పోటీచేస్తారా? గిద్దలూరులో పోటీచేస్తారా? అనే మాట మాత్రమే జగన్ అడిగినట్టు తెలుస్తోంది. బాలినేని మళ్లీ ఇళ్ల పట్టాల స్థలాల పరిహారం తెరమీదకు తెచ్చారు. బాలినేని భేటీ తర్వాత.. ఆ 170 కోట్ల రూపాయలు నిధుల విడుదలకు సంబంధించి కూడా ఉత్తర్వులు విడుదలైనట్లు వార్తలు వస్తున్నాయి.
బాలినేని శ్రీనివాసరెడ్డి తాను ఒంగోలు నుంచి పోటీచేయాలంటే.. రెండు కండిషన్స్ పెట్టారు. ఆయన అడిగిన స్థలాల పరిహారం నిధులను జగన్ భేటీ తర్వాత విడుదల చేయించేశారు. రెండో డిమాండు మాగుంటకు ఎంపీ సీటు అనేది నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇంతకూ బాలినేని శ్రీనివాసరెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్టా? రాజీపడినట్టా? అనే చర్చ నడుస్తోంది.
నిధులు విడుదలైపోయినందున.. ఆయన ఇక ఒంగోలునుంచే పోటీచేయాల్సి ఉంటుందని కూడా పలువురు భావిస్తున్నారు. బాలినేని చేసిన ఈ చివరి ప్రయత్నం తర్వాత.. మాగుంట కుటుంబానికి ఇక వైఎస్సార్ కాంగ్రెస్ లో భవిష్యత్తు లేదని అర్థమైపోతోంది.