రాజకీయంగా సుద్దులు చెప్పడంలో పవన్ కల్యాణ్ ను మించిన వాళ్లు ఉండరు. యువరక్తం గురించి, రాజకీయాల్లోకి యువకులు రావాల్సిన అవసరం గురించి, కేవలం యువతను నమ్ముకునే తాను రాజకీయం చేస్తుండడం గురించి ఆయన అనేక సార్లు ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతూ ఉంటుంది.
యువరక్తం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్.. రాజకీయాల నుంచి రిటైర్ అయి ఇంచుమించు దశాబ్దానికి పైగా విరామజీవితం గడుపుతున్న వృద్ధ నాయకుల్ని తన పార్టీలో చేర్చుకోవడానికి ఎగబడుతుండడం ఆశ్చర్యకరంగా ఉంది.
ముద్రగడ పద్మనాభం దాదాపుగా ఎన్నడో రాజకీయాల నుంచి రిటైరైపోయారు. కాపుజాతిని ఉద్ధరిస్తా అంటూ అప్పుడప్పుడూ అంటూ ఉంటారు తప్ప.. ఆయన యాక్టివిటీ వేరే ఏం లేదు. ప్రతిసారీ ఎన్నికలలో పోటీచేయాలని అనుకుంటారే గానీ.. రంగంలోకి దిగడం లేదు.
కాపులను బీసీలుగా చేస్తానంటూ మాయమాటలు చెప్పి వంచించిన చంద్రబాబు తీరును దారుణంగా విమర్శించిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావాలని అనుకుంటూ ఉండడం చిత్రమైన పరిణామం. చంద్రబాబు పల్లకీ మోయడానికి ఎగబడుతున్న పవన్ కల్యాణ్ పార్టీలోనే ఆయన చేరబోతున్నారు. రిటైర్డ్ రాజకీయ జీవితం గడుపుతున్న ఈ కాపు నాయకుడిని కేవలం కుల సమీకరణల కోసం, పవన్ కల్యాణ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించి తన పార్టీలో చేర్చుకోబోతున్నారు.
అలాగే ప్రజాజీవితంలో ఎన్నికల్లో పోటీచేసే నెగ్గే దశను ఏనాడో దాటిపోయి.. ప్రస్తుతానికి విరామ జీవితం గడుపుతున్న మరో వృద్ధ నాయకుడు కొణతల రామకృష్ణను కూడా జనసేనలో చేర్చుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొణతల రామకృష్ణ రాజకీయాలు మానేసి చాలా కాలం అయింది. అయినా ఈ వృద్ధ నాయకులు అందరికీ ఎన్నికల సీజను రాగానే ఆశ పుడుతుంది. మళ్లీ పోటీచేయాలని అనిపిస్తుంది. తమను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నపార్టీలు ఏమిటా వెతుకుతూ ఉంటారా? అనే అభిప్రాయం కలుగుతోంది.
పవన్ కల్యాణ్ ఎలాంటి కబుర్లయినా చెబుతూ ఉండవచ్చు గానీ.. ఆయన పట్ల యువనేతలు పెద్దగా ఆకర్షితులు కావడం లేదు. ఎక్కడా ఠికానా లేనివారు రావడం వేరు.. తమకంటూ కాస్త ప్రజాదరణ ఉన్న నాయకులు రావడం వేరు. కనీసం నలుగురికి తెలిసిన పేరుగా ఉండడమే ప్రాతిపదిక అయితే.. అలాంటి యువనేతలు జనసేనవైపు రావడం లేదు.
వంగవీటి రాధా కు గత ఏడాది మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తాం అంటూ పవన్ మభ్యపెట్టినట్టుగా ఒక ప్రచారం జరిగింది. అయితే తాజాగా బాలశౌరి జనసేనలో చేరుతుండడంతో.. యువనేత వంగవీటి రాధాకు పవన్ కల్యాణ్ హ్యాండ్ ఇచ్చినట్టే. అక్కడ మాత్రం కులం కూడా పట్టించుకోలేదు. రాధా తాను తెలుగుదేశాన్ని వీడేది లేదని తెగేసి చెప్పేశారు. ఇలా.. యువరక్తం అని పదేపదే అంటూ.. వృద్ధనేతలను తన జట్టులోకి చేర్చుకుంటూ వారిమీద ఆధారపడుతున్నారని జనం అనుకుంటున్నారు.