దర్శకుడు త్రివిక్రమ్ కు తన సినిమాల్లోని పేర్లతో ఎవరో ఒకరిని గిల్లడం అలవాటు! తనో అపరమేధావిని అనుకుంటాడో ఏమో కానీ సామాజికంగా పేరు పొందిన వారిని పేర్లను అప్పనంగా, అపసవ్యంగా వాడుకుంటూ ఉంటారు.
ఇలాంటి పలు సార్లు వివాదాలు కావడం, ఆ తర్వాత ఆ పాత్రలకు పేర్లను మార్పించడం కూడా గతంలో జరిగింది. మరి ఇప్పుడు తన గుంటూరు కారం సినిమా రచనతో త్రివిక్రమ్ ప్రేక్షకులను మెప్పించడం సంగతి అటుంచితే, మార్క్స్, లెనిన్ అంటూ నెగిటివ్ రోల్స్ కు పేర్లను పెట్టడం వివాదానికి దారి తీస్తోంది.
త్రివిక్రమ్ కు కమ్యూనిస్టు పోకడ నచ్చకపోయి ఉండొచ్చు. అది ఆయన వ్యక్తిగతం. మరి మార్క్స్, లెనిన్ అంటూ విలన్ తరహా పాత్రలకు పేర్లను పెట్టడం ఆయనకు ఏ మేరకు సమంజసంగా అనిపించిందో! తను మార్క్స్ కన్నా మేధావిని అని, లెనిన్ కన్నా నాయకుడిని అని త్రివిక్రమ్ భావిస్తున్నట్టుగా ఉన్నారు కాబోలు! ఇంకే పేరూ దొరకనట్టుగా మార్క్స్ పేరును కూడా వాడుకోవడం ఆయన భావ దారిద్య్రానికి ప్రతీక అని చెప్పాలి!
తన మేధస్సుతో పవన్ కల్యాణ్ ను దేవుడిగా చేసిన త్రివిక్రమ్, అదే మేధస్సుతో మార్క్స్ ను, లెనిన్ కూడా విలన్లుగా చేయగలడని నిరూపించుకున్నాడు. అయితే ఈ అపరమేధస్సుతో త్రివిక్రమ్ సాధిస్తున్నది ఏమిటో కానీ.. ఇలాంటి పేర్లు పెట్టడంతో సమాజంలోని వివిధ వర్గలపై తన ద్వేషాన్ని త్రివిక్రమ్ చాటుకుంటూ ఉన్నాడు.
ఎవడో అల్లాటప్పా రచయిత అలాంటి పేర్లు పెట్టాడంటే, తెలిసో తెలీకో.. అనే మాట వస్తుంది. అయితే త్రివిక్రమ్ అపరమేధావిలా మాట్లాడే త్రివిక్రమ్ ఇలాంటి తీరుతో.. ఈయన వివిధ వర్గాలను శత్రువులుగా మార్చుకుంటూ ఉన్నారని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. త్రివిక్రమ్ గతంలో కులాలను ఇలానే గిల్లాడు, ఇప్పుడు వాదాలను కూడా గిచ్చుతున్నాడు. తిరగేస్తే ఉన్న మతి పోయిందన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం!