విశాఖ ఎంపీ అభ్యర్ధిగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మిని వైసీపీ అధినాయకత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. విశాఖ ఎంపీ సీటు అంటే ప్రతిష్టాత్మకమైనది. దేశంలోని ఫేమస్ పార్లమెంట్ సీట్లలో విశాఖ ఒకటిగా ఉంది.
ఇదిలా ఉంటే సీటు తన సతీమణికి ప్రకటించిన తరువాత మొదటిసారిగా విశాఖ పార్లమెంట్ పరిధిలో రాజకీయ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ మీద బొత్స లాంచనంగా ఒక సమీక్ష చేశారు అని తెలుస్తోంది. విశాఖలోని బొత్స నివాసానికి వైసీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ సహా కీలక నేతలు హాజరయ్యారు. విశాఖ ఎంపీ సీటులో బలాబలాలు వంటివి సీనియర్ మంత్రి ప్రాధమికంగా అంచనా వేసే ప్రయత్నం చేశారు అని అంటున్నారు.
విశాఖ ఎంపీ సీట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మూడు తప్ప మిగిలినవి టీడీపీ ఆధీనంలో ఉన్నాయి. అయితే 2020 తరువాత విశాఖ సౌత్ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్ అయ్యారు. అలా లెక్క చూసుకుంటే వైసీపీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నట్లే లెక్క. కానీ విశాఖలోని గాజువాక, భీమునిపట్నం. తూర్పు పశ్చిమం ఈసారి టఫ్ గా ఉండబోతున్నాయని అంటున్నారు. ఎస్ కోట వైసీపీకి ఎడ్జ్ ఉన్న సీటుగా కనిపిస్తోంది. అలాగే విశాఖ నార్త్ సౌత్ లలో వైసీపీకి గెలిచే వీలు ఉంది అని అంటున్నారు.
ఇక మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లలో వైసీపీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీలలో మరింతగా పట్టు సాధించాల్సి ఉంది. విశాఖ ఎంపీ సీటు విషయంలో 2019లో ఒక మ్యాజిక్ జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలుచుకున్నా ఎంపీ సీటు వైసీపీకి దక్కింది. దానికి కారణం ట్రయాంగిల్ పోటీ. ఈసారి అలా జరగకపోవచ్చు. పొత్తులు ఉంటాయి కాబట్టి ముఖా ముఖీ పోరు ఉంటుంది. దాంతో బొత్స వీటి మీద లోతుగా ఆలోచించాల్సి ఉంది అని అంటున్నారు.