వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేసే వారికి టికెట్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. దాంతో సీనియర్ నేతలు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకు వస్తున్నారు. తమకు దశాబ్దాల సీనియారిటీ ఉందని పేర్కొంటూ దరఖాస్తులు నేరుగా బాబుకే చేసుకుంటున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలోని అరకు ఎంపీ సీటు కోసం ఒక సీనియర్ తమ్ముడు ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీ తెగకు చెందిన కొర్రా మధుసూదన రావు తనకు టికెట్ ఇస్తే అరకు ఎంపీగా పోటీ చేయడమే కాదు గెలుస్తాను అని చెబుతున్నారు.
పార్టీకి దశాబ్దాలుగా సేవ చేశాను అని ఆయన అంటున్నారు. పార్టీ తన సేవలను గుర్తించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు కూడా దరఖాస్తు చేశాను అని చెప్పారు. పార్టీ కష్టపడిన వారికి టికెట్ ఇస్తుందని చెబుతున్న క్రమంలో తనకు అవకాశం దక్కుతుంది అని ఆయన అంటున్నారు.
అయితే ఏ రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేని సీనియర్ తమ్ముళ్ల విషయంలో టీడీపీ టికెట్ ఇస్తుందా అన్నది సందేహంగానే ఉందని అంటున్నారు. అరకు ఎంపీ సీటుకి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ పేరుతో పాటు మరిన్ని పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఎంపీ సీటుకు అంగబలం అర్ధబలం ప్రధానంగా చూస్తున్నారు అని అంటున్నారు.
అయితే సీనియర్ తమ్ముళ్ళు చాలా మంది ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టీడీపీలో సిద్ధంగా ఉన్నారు. తాము ఎపుడూ పల్లకీ మోసే బోయీలమేనా తాము కూడా అదే పల్లకీలో కూర్చుంటామని ఆశ పడుతున్న వారు అనేక మంది ఉన్నారు.
అలా ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, చోడవరం సహా అనేక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. చంద్రబాబు నిర్ణయం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి టీడీపీ చాన్స్ ఇస్తే మాత్రం అది అద్భుతమే అవుతుంది. కానీ అలా చేస్తారా అన్నదే పెద్ద డౌట్ అంటున్నారు.