ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లికి చెందిన కొణతాల రామక్రిష్ణ సాత్వికుడైన రాజకీయ నేత. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఉత్తరాంధ్రా దిగ్గజ నేత దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ చేయూతను ఇచ్చారు ఆ తరువాత వైఎస్సార్ ఆయనకు అండగా నిలిచారు.
అలా కడుపులో చల్ల కదలకుండా కొణతాల రాజకీయం రెండు దశాబ్దాల పాటు సాఫీగా సాగిపోయింది. ఎపుడైతే వైఎస్సార్ మరణించారో కొణతాలకు కష్టాలు మొదలయ్యాయి. రాజకీయాల్లో దూకుడు అవసరం అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. కొణతాల తీరు చూస్తే తనకు ఏదైనా పార్టీలో నచ్చకపోతే మౌనం వహిస్తారని పేరు. అలాగే అలకపానుపు ఎక్కుతారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట.
వైసీపీ నుంచి ఆయన బయటకు వెళ్లాక టీడీపీకి 2019లో మద్దతు ఇచ్చారు. అక్కడ కూడా ఉండలేకపోయారు. ఇపుడు జనసేన అంటున్నారు. బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలసిన కొణతాల ఆ పార్టీలో తొందరలో చేరనున్నట్లుగా ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ కొణతాల జనసేనలో సర్దుకుపోగలరా అన్న మాట వినిపిస్తోంది.
జనసేనలో చేరేందుకు కూడా కొణతాలా చాలా ఆలోచించారని అంటున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆయనకు ఉంది. 2019లో టీడీపీ నుంచి చేయాలనుకున్నారు సాధ్యపడలేదు. ఇపుడు జనసేనలో చేరినా ఆయన కోరిక అదే. జనసేన ఆ టికెట్ ని ఆయనకు ఇవ్వకపోయినా అసలు పొత్తులో భాగంగా జనసేనకు సీటు దక్కకపోయినా కొణతాల పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని గెలిపించాల్సి ఉంటుంది.
కూటమి రేపటి రోజున ఏపీలో అధికారంలోకి వస్తే అపుడు ఏదైనా పదవి ఇస్తామని హామీతో సంతృప్తి పడాల్సి ఉంటుంది. అందువల్ల కొణతాల రాజకీయం కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో నడచినంత సాఫీగా మరే ప్రాంతీయ పార్టీలోనూ సాగదు. అది అర్ధం చేసుకుని ఆయన వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తే రాజకీయాల్లో చురుకుగా ఇకపైన కూడా కొనసాగే వీలుందని అంటున్నారు.