ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యే. విశాఖ సౌత్ నుంచి మళ్లీ పోటీ చేయాలని ఆశిస్తున్న నేత. వైసీపీ హై కమాండ్ కూడా ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందని ప్రచారం సాగుతోంది. ఆయనకు టికెట్ ఇవ్వడం గిట్టని వారు వైసీపీలో ఉన్నారు. కొందరు బయటకు వెళ్ళిపోయారు కూడా.
ఆయన గెలిచి వదిలేసి వచ్చిన పార్టీ టీడీపీ ఆయన మీద డేగ కన్ను పెట్టి తప్పులను వెతుకుతోంది. ఇలా అన్ని వైపులా పొలిటికల్ గా సీసీ కెమెరాలు ఉన్న నేపధ్యంలో వాసుపల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయన సంక్రాంతి వేడుకల సందర్భంగా తన విద్యా సంస్థ నుంచి కార్యకర్తలకు మందు బాటిల్స్ కోళ్ళు ఇస్తూ అడ్డంగా దొరికేశారు.
ఆయన విద్యా సంస్థ నుంచి కోడిని ఒక వైపు మందు బాటిల్ ని మరో వైపు దర్జాగా తెచ్చుకుని బయటకు వచ్చిన సిబ్బందే మీడియాకు ఆ విషయం చెప్పేశారు. దాంతో వాసుపల్లిని స్వపక్షంతో పాటు విపక్షం ఆటాడుకుంటోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిన బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు సుధాకర్ అయితే వైసీపీ మీద విమర్శలు కురిపిస్తున్నారు.
జనసేన టీడీపీ నాయకులు వాసుపల్లికి పోటీ చేసే అర్హత లేదని అంటున్నారు. ఇలా వాసుపల్లి సంక్రాంతి పండుగ కాదు కానీ వివాదంలో కూరుకుపోయారు. చివరికి ఆయన అంటున్నది ఏంటి తన మీద విపక్షాలు బురద జల్లుతున్నాయని. వచ్చే ఎన్నికల్లో విశాఖ దక్షిణం గెలవాలని వైసీపీ చూస్తూంటే ఆ పార్టీ నేతలు ఇలా తలో రకంగా వ్యవహరిస్తూ ప్రత్యర్ధులకు దొరికేస్తున్నారు.
వాసుపల్లి తీరుతో ఇపుడు వైసీపీ కూడా ఇబ్బందిలో పడింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వవద్దను ఆ నియోజకవర్గం నేతలు కార్పోరేటర్లు కూడా మరోమారు హై కమాండ్ కి విన్నవించుకుంటున్నారు అయినా రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన నేతకు ఎన్నికల వేళ జాగ్రత్తగా ఉండాలని తెలియదా అని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి.