భారాస: మూలిగే నక్కమీద తాటిపండులాగా..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తాను జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని, ఢిల్లీ రాజకీయాలను శాసించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా…

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తాను జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని, ఢిల్లీ రాజకీయాలను శాసించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేసుకున్నారు. తమది జాతీయ పార్టీ అని, దేశమంతా రాజకీయాలు చేస్తాం అని చాటి చెప్పారు.

మోడీ సర్కారు పతనం కళ్లజూస్తానని అన్నారు. మోడీ కాంగ్రెసులను ఓడించి కేంద్రంలో అధికారంలోకి రావడం కేవలం తమ వల్లనే సాధ్యమవుతుందని కూడా అన్నారు. ఎన్ని మాటలు చెప్పినా.. తెలంగాణ ప్రజలు ఆయనను తిప్పికొట్టారు.

రాష్ట్రంలో అధికారం కూడా చేజారింది. ఇప్పుడిక భారత రాష్ట్ర సమితి అస్తిత్వమే ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో ఇప్పుడున్న పాటి ఎంపీ సీట్లనయినా 2024 ఎన్నికల్లో నిలబెట్టుకోవడమే వారికి అతిపెద్ద సవాలుగా మారుతోంది.

ఇక దేశ రాజకీయాల మీద ఏమాత్రం కసరత్తు చేస్తారు.. ఎంత మేర పోటీపడతారు అనేది సందేహాస్పదంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగేనక్కమీద తాటిపండు పడిన చందంగా భారాసకు ఒక ఇబ్బందికర  పరిణామం ఎందురైంది.

భారాసను ప్రారంభించిన నాటి నుంచి కేసీఆర్ చాలా దూకుడుగా వ్యవహరించారు. దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీల కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ శాఖలు ఉంటాయని.. ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీ  పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతుందని కూడా ఆయన సెలవిచ్చారు.

భారాసలోకి ఎక్కువ చేరికలు మహారాష్ట్ర నుంచి జరిగాయి. ఏపీ శాఖకు తోట చంద్రశేఖర్ ను సారథిని చేశారు. అలాగే ఒడిశాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ను కూడా ఆయన తన పార్టీలో చేర్చుకున్నారు. ఆ రకంగా తమ భారాస పార్టీ లో చేరడానికి దేశమంతటి నుంచి సీనియర్ నాయకులు వెల్లువెత్తుతున్నట్టుగా చాటుకున్నారు.

అయితే సదరు గిరిధర్ గమాంగ్ తాజాగా భారాసను గుడ్ బై చెప్పేసి, తన మాతృపార్టీ కాంగ్రెసులో చేరిపోయారు. జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాలు అనే ఆశలు కేసీఆర్ లో ఇంకా ఏ కొంచెమైనా మిగిలి ఉంటే గనుక.. గమాంగ్ వాటిమీద నీళ్లు చల్లేశారని అనుకోవచ్చు.

గిరిధర్ గమాంగ్ ఎంతటి ప్రభావశీలియైన నాయకుడు.. ఆయనేమైనా భారాస తరఫున ఒడిశా రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారా? అనే ప్రశ్నలు ఎదురుకావొచ్చు. కానీ ఆయనను పిలిచి పార్టీలో చేర్చుకున్ననాడు కేసీఆర్ అదే స్థాయిలో మాట్లాడారు.

తెలంగాణలోనే ఓడిపోవడంతో.. భారాస భవిష్యత్తు గురించి ఒడిశాకు గతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన ఈ సీనియర్ నేత గిరిదర్ గమాంగ్ కు కళ్ల ముందున్న పొరలు తొలగిపోయాయేమో. ఆయన భారాసను వీడిపోవడం చాలా సింపుల్ గా జరిగిపోయింది.

అసలే పార్టీపేరును మళ్లీ తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మారిస్తేనే భవిష్యత్తు ఉంటుందనే డిమాండ్లు వెల్లువెత్తుతున్న సమయంలో.. ఈ దెబ్బ కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని మరింతగా నీరసపరుస్తుందనడంలో సందేహం లేదు.