టీడీపీ, జ‌న‌సేన‌ల‌లో నివురుగ‌ప్పిన టికెట్ల నిప్పు!

టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌లో టికెట్ల వ్య‌వ‌హారం నివురుగ‌ప్పిన నిప్పులా వుంది. ఇంత వ‌ర‌కూ ఆ రెండు పార్టీల అధినేత‌లు ఏ పార్టీకి ఎన్ని టికెట్లు? ఎక్క‌డెక్క‌డ సీట్లు కేటాయిస్తార‌నే విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌లేదు. అంతా…

టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌లో టికెట్ల వ్య‌వ‌హారం నివురుగ‌ప్పిన నిప్పులా వుంది. ఇంత వ‌ర‌కూ ఆ రెండు పార్టీల అధినేత‌లు ఏ పార్టీకి ఎన్ని టికెట్లు? ఎక్క‌డెక్క‌డ సీట్లు కేటాయిస్తార‌నే విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌లేదు. అంతా లోలోప‌ల జ‌రుగుతోంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఎన్ని సీట్లు ఇచ్చినా ప‌ట్టించుకోర‌ని ప్ర‌చారాన్ని టీడీపీ పెద్ద ఎత్తున చేస్తోంది. ప‌వ‌న్‌కు ప‌ద‌వుల‌పై కోరిక లేద‌ని, ఆయ‌న ల‌క్ష్య‌మ‌ల్లా జ‌గ‌న్‌ను గ‌ద్దె దింప‌డ‌మే అని టీడీపీ చెబుతోంది.

అందుకే చంద్ర‌బాబునాయుడే ముఖ్యమంత్రి అని లోకేశ్ చెప్పినా ప‌వ‌న్‌క‌ల్యాణ్ నోరు మెద‌ప‌లేద‌ని టీడీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. మ‌రోవైపు వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టికి మూడు జాబితాలు వ‌చ్చాయి. నాలుగో జాబితా ఏ క్ష‌ణాన్నైనా వెలువ‌రించ వ‌చ్చు. అక్క‌డ‌క్క‌డ అల‌క‌లు, ఘాటు విమ‌ర్శ‌లు చేసే వైసీపీ నేత‌ల్ని చూస్తున్నాం. వైసీపీ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తుండ‌డంతో కొన్ని చోట్ల అస‌మ్మ‌తి స్వ‌రాలు వినిపిస్తున్నాయి.

అయితే టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ఇంత వ‌ర‌కూ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో అసమ్మ‌తి గ‌ళాలు ఇంకా తీవ్ర‌స్థాయిలో బ‌య‌ట ప‌డ‌లేదు. టీడీపీలో కొన్ని చోట్ల అసంతృప్తులు బ‌య‌టికొచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక‌, సీట్ల కేటాయింపు కోసం ఇరుపార్టీల నేత‌లు ఎదురు చూస్తున్నారు. టికెట్ ఎవ‌రికి ఇచ్చినా అంతా క‌లిసి ప‌ని చేసుకుంటామ‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు పైకి చెబుతున్న‌ప్ప‌టికీ, అదంతా ఈజీ టాస్క్ కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఉదాహ‌ర‌ణ‌కు తెనాలిలో నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు టికెట్ ఇస్తే, ఆల‌పాటి రాజా మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పైకి మాత్రం ఇద్ద‌రూ క‌లిసి మీడియాకు ఫోజులిస్తున్నారు. అలాగే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ, జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య స‌యోధ్య అంత ఈజీ కాద‌నే మాట వినిపిస్తోంది. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు, విడ‌వ‌మంటే పాముకు కోపం అనే చందంగా టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య టికెట్ల వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌ని చెప్పొచ్చు.

అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నంత వ‌ర‌కే టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య స‌యోధ్య ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత అస‌లు సినిమా చూస్తామ‌ని ప‌లువురు అంటున్నారు. ఈ నెలాఖ‌ర‌కైనా సీట్ల విష‌య‌మై కొలిక్కి వ‌స్తుంద‌ని ఆ రెండు పార్టీల నేత‌లు న‌మ్మ‌కంగా ఉన్నారు. త‌మ‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు రాక‌పోతే మాత్రం… ర‌చ్చ‌ర‌చ్చ చేయ‌డానికి అనుచ‌రులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మ‌రో పార్టీ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చ‌డానికి ఏ నాయ‌కులూ సిద్ధంగా ఉండ‌రు. ఇందుకు టీడీపీ, జ‌న‌సేన నేత‌లు అతీతం కాదు.