ఒకప్పుడు చేతిలో మీడియాని అడ్డు పెట్టుకుని ప్రత్యర్థులతో పాటు స్వపక్షంలోని వ్యతిరేకులపై చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేసేవారు. ఇదే క్రమంలో తన గురించి చాలా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అపర చాణక్యుడని, ప్రపంచ మేధావిగా, హైదరాబాద్‌ను నిర్మించిన పాలకుడిగా, ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన విజనరీగా చంద్రబాబుకు ఇమేజ్ తీసుకురావడంలో ఎల్లో మీడియా సక్సెస్ అయ్యింది.
ఇదంతా ప్రత్యామ్నాయ మీడియా లేని రోజుల్లో యథేచ్ఛగా సాగింది. సోషల్ మీడియా బలోపేతం అయిన తర్వాత చంద్రబాబు పప్పులుడకలేదు. చంద్రబాబు చాణక్యుడు కాదు, వెన్నుపోటుదారుడని, ఎన్టీఆర్ గద్దె దించడంలో ఎలాంటి కుట్రలకు తెరలేపారో లోకానికి బలంగా చూపగలిగారు. అలాగే హైదరాబాద్‌కు ఐటీ రంగాన్ని తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించిందని వెలుగులోకి వచ్చింది.
ఇలా ఒకటా రెండా… చంద్రబాబు గురించి జరిగిన ప్రచారంలో అవాస్తవాలు చాలా ఉన్నాయని సోషల్ మీడియా బయట పెట్టింది. ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు ప్రత్యర్థులపై ఎల్లో మీడియా ఉన్నది, లేనిది రాస్తూ, ప్రజల్ని ప్రభావితం చేసి, రాజకీయంగా లబ్ధి పొందడానికి విషాన్ని చిమ్మడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పటికీ అదే తంతు సాగుతోంది. టీడీపీ అగ్రనేతలతో ఫలానా వైసీపీ ముఖ్య నాయకుడు భేటీ అయ్యారంటూ ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడడం కొత్త కాదు.
అయితే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ వైసీపీ కూడా ఆ విద్యలో ఆరితేరిపోయింది. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని వైసీపీ పుణికి పుచ్చుకుంది. లోకేశ్‌తో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి భేటీ అయ్యారంటూ పదేపదే ప్రచారాన్ని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. ఇదే సందర్భంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వైసీపీలోకి వెళుతున్నారనే ప్రచారాన్ని ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం మొదలు పెట్టింది. దీంతో ఖంగుతిన్న టీడీపీ నాయకుడు యరపతినేని తాను పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
వైసీపీలో బలమైన నాయకులుగా పేరున్న నాయకుల రాజకీయ భవిష్యత్‌తో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంటే, దాన్ని దీటుగా తిప్పి కొడుతూనే, మరోవైపు అదే రీతిలో అధికార పార్టీ ఆడుకుంటోంది. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయినా, జగన్‌కు షాక్ అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఆ తర్వాత జగన్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్‌లో ఆడుకోవడంతో తోక ముడిచారు.
ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీ నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచారాన్ని చేస్తోంది. వైసీపీ కూడా దాన్ని తిప్పి కొట్టే క్రమంలో తనవైన నిజాల్ని బయట పెడుతూ నోరు మూయిస్తోంది. ఎన్నికల సమయంలో ఇరుపార్టీల మధ్య మైండ్ గేమ్ ఆసక్తికరంగా సాగుతోంది. వీళ్ల మధ్యలో పానకంలో పుడకలా జనసేన వుంది.