ఎన్నికలొచ్చాయంటే చాలు… ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు అన్నీ ఉచితమని హామీలిస్తుంటారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆటో కార్మికులు తమకు ఉపాధి పోయిందని లబోదిబోమంటున్నారు. పాలకులెవరూ తమ సొంత సొమ్మును ప్రజలకు ఉచితంగా పంపకాలు చేయరనే సంగతి మరిచిపోకూడదు.
ఉచితాల పుణ్యమా అని సరుకుల ధరలు అమాంతం పెరుగుతూ సామాన్య ప్రజానీకం నడ్డి విరుగుతోంది. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మినీ మ్యానిఫెస్టో ప్రకటించింది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితం, అలాగే 18 నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున పంపిణీ, ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది ట్రైలర్ మాత్రమే అని ఆయన అన్నారు.
ఇక టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో విడుదలైతే, ఇంకెన్ని ఉచితాలు వుంటాయో చూడాలి. సంక్షేమ పాలనకు వైసీపీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ అన్నీ ఉచితంగా ఇవ్వడం వల్ల రాష్ట్రం దివాళా తీసిందని ఇంత కాలం ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు అవే ప్రతిపక్షాలు జగన్ కంటే మిన్నగా ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీలిస్తున్నాయి. వైసీపీ మ్యానిఫెస్టో ఎలా వుంటుందో చూడాల్సి వుంది.
ఉచితాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం తప్ప ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని ఆయన ఇవాళ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏ పార్టీలైనా సరే పోటీ పడి అన్నీ ఫ్రీ అంటూ హామీలు ఇవ్వొద్దని సూచించారు. ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ తెలుగు మరిచిపోవద్దని ఆయన సూచించారు.