అవసరానికి వాడుకోవడంలో చంద్రబాబుకు మించిన వారు లేరని ఆయనంటే గిట్టని వాళ్లు, గిట్టే వాళ్లు కూడా అనే మాట. మనుషుల్ని రాజకీయ ప్రయోజనాల కోసం కరివేపాకులా వాడుకోవడంలో బాబును చూసి ఎవరైనా నేర్చుకోవాలని వ్యంగ్యంగా అంటుంటారు. బాబు వెన్నుపోటుకు బలైన వాళ్లలో ఎన్టీఆర్ మొదటి వ్యక్తి. ఆ తర్వాత లక్ష్మీపార్వతి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ తదితరుల గురించి ఉదహరిస్తుంటారు.
ముఖ్యమంత్రి పదవి కోసం తనను చంద్రబాబు మానవ సమాజం సిగ్గుపడేలా వెన్నుపోటు పొడిచారని స్వయంగా ఎన్టీఆరే ఘాటు విమర్శలు చేశారు. పదవీచ్యుతుడైన సందర్భంలో చంద్రబాబు క్రూరత్వం గురించి ఎన్టీఆర్ ఆవేశంగా చాలా విషయాలు చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మచ్చ చంద్రబాబుపై ఎప్పటికీ వుంటుంది. అది ఎప్పటికీ చెరిగిపోదు.
చంద్రబాబులో ఎంత చతురత వుందంటే… ఆఫ్ ది రికార్డుగా ఎన్టీఆర్‌పై సరైన అభిప్రాయం లేదు. ఈ విషయాన్ని ఒక మీడియాధిపతితో నిర్వహించిన చిట్‌చాట్‌లో వెలుగు చూసిన వైనం అందరికీ తెలిసిందే. కానీ జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించే సమయంలో మాత్రం ఎన్టీఆర్‌ను యుగ పురుషుడని కీర్తిస్తుంటారు. ఒక మనిషిని నీచుడనాలన్నా, గొప్పవాడని ప్రశంసించాలన్నా కేవలం చంద్రబాబు నుంచే నేర్చుకోవాలి.
మానసిక క్షోభకు గురి చేసి, చివరికి ఎన్టీఆర్ ప్రాణాలు పోవడానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబునాయుడు … ఇప్పుడు వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం కృష్ణా జిల్లాలోని ఆయన స్వస్థలం నిమ్మకూరుకు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు వెళ్లనున్నారు. ఇదే రోజు రా.. కదిలిరా కార్యక్రమాన్ని కూడా గుడివాడలో నిర్వహించనున్నారు.
రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్‌ను పదేపదే స్మరించుకోవడాన్ని గమనించొచ్చు. అసలు ఎన్టీఆర్ ఉనికే లేకుండా చేయాలని చంద్రబాబు అనుకుంటున్నా, ఆయన పేరు చెప్పకపోతే జనం పట్టించుకోని పరిస్థితి. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్‌ను అలా వాడేసుకుంటున్నారాయన.