గుండె పోటుకు గురై చికిత్స పొందుతున్న తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మృత్యువుతో పోరాడుతున్నారు. తమ్మినేనికి వైద్యం అందిస్తున్న హైదరాబాద్‌లోని ఏఐజీ వైద్యులు బుధవారం మధ్యాహ్నం మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
తమ్మినేని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. తమ్మినేని ఆరోగ్యం గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. 24 నుంచి 48 గంటలు గడిస్తే తప్ప ఎలా వుంటుందనేది స్పష్టంగా చెప్పలేమని పేర్కొనడం గమనార్హం.
గుండెతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యతో కూడా తమ్మినేని బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. తమ్మినేని మంగళవారం గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనకు ఖమ్మంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
తమ్మినేని విషమ పరిస్థితిలో ఉన్నారని తెలిసి పెద్ద సంఖ్యలో వామపక్ష కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు ఎవరూ ఆస్పత్రికి రావద్దని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీవీ రాఘవులు విజ్ఞప్తి చేశారు.