రిక్షా తొక్కిన ఎంపీ.. సూపరెహే….!

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయ నేతల విన్యాసాలు చూసే టైం వచ్చేసింది. ఏదో ఒక విధంగా న్యూస్ వైరల్ కావాలి. హైప్ క్రియేట్ చేయాలి. అలా తాము జనాల మెదళ్లలో ఉండాలి. ఇదే నేతాశ్రీల…

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయ నేతల విన్యాసాలు చూసే టైం వచ్చేసింది. ఏదో ఒక విధంగా న్యూస్ వైరల్ కావాలి. హైప్ క్రియేట్ చేయాలి. అలా తాము జనాల మెదళ్లలో ఉండాలి. ఇదే నేతాశ్రీల లక్ష్యంగా ఉంటోంది.

విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు మార్చితో ఆరేళ్ల ఎంపీ పదవీ కాలం పూర్తి అవుతోంది. ఏదో ఒక నియోజకవర్గం చూసుకుంటే టికెట్ ఇస్తామని హై కమాండ్ మూడేళ్ళ క్రితమే చెప్పింది అని అంటున్నారు.

అలా బాపట్ల నుంచి విశాఖకు షిఫ్ట్ అయిన జీవీఎల్ తన పొలిటికల్ లక్ ని విశాఖ నుంచే టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆయన మీడియా సమావేశాలలో పొలిటికల్ పంచ్ లు పేలుస్తూ సోషల్ మీడియాకు పరిమితం అయ్యారు.

ఇపుడు మరింతగా ప్రాచుర్యం పొందేందుకు జనాల మధ్యకు వస్తున్నారు. సంక్రాంతి సంబరాలు పేరుతో విశాఖలో అయిదు రోజుల పాటు కల్చరల్ ఈవెంట్స్ ని ఎంపీ నిర్వహించారు. చివరి రోజు అయిన కనుమ వేళ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో మహా సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీవీఎల్ ఓ రిక్షా కార్మికుడిని కూర్చోబెట్టుకుని రిక్షా తొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో ఉన్న జీవీఎల్ నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రిక్షా తొక్కడమే కాదు ఎక్కిన ఆ రిక్షా కార్మికుడికి డబ్బులు కూడా ఇచ్చారు.

ఇది ఉల్టా పుల్టా అన్న మాట. సాధారణంగా రిక్షా ఎక్కిన వారు డబ్బులు ఇస్తారు. తొక్కిన వారు తీసుకుంటారు. జీవీఎల్ మాత్రం రివర్స్ లో తొక్కి మరీ డబ్బులు ఇచ్చారు. ఇలా  దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పంచుకున్నారు.

“విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో రిక్షా కార్మికుడు పెంటయ్యను అతని రిక్షాలోనే ఎక్కించుకుని తొక్కాను. తన రిక్షా తొక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు అతనికి రుసుం చెల్లించాను” అని జీవీఎల్ వివరించారు. జీవీఎల్ రిక్షా ఫీట్ ఇది. ముందు ముందు ఆయన మరెన్ని విధాలుగా జనం ముందుకు వస్తారో అన్న చర్చకు అయితే తెర లేచింది.