తూర్పు గోదావరిలో జనసేనకు మూడు సీట్లా?

జనసేనకు తెలుగుదేశం ఎన్ని సీట్లు కేటాయిస్తుంది. ఇది ఓ బిగ్ పజిల్. అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అన్నట్లుగా మొదట్లో 40 కి తక్కువ వుండవు అని వినిపించాయి. తరువాత పవన్ 32 అడిగారని వార్తలు…

జనసేనకు తెలుగుదేశం ఎన్ని సీట్లు కేటాయిస్తుంది. ఇది ఓ బిగ్ పజిల్. అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అన్నట్లుగా మొదట్లో 40 కి తక్కువ వుండవు అని వినిపించాయి. తరువాత పవన్ 32 అడిగారని వార్తలు తెలుగుదేశం మనోభావాలను ఒడిసి పట్టే పత్రికలో వార్తలుగా వెలువడ్డాయి. దయతలచి, ఉదారంగా 27 ఇచ్చే అవకాశం వుందని కూడా రాసేసారు. దాంతో ఇటు తెలుగుదేశం, అటు జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో భగ్గు మన్నాయి. దాంతో ఆ పత్రిక ఈ సీట్ల పంపిణీపై మౌనం వహించింది.

ఇదిలా వుంటే జగన్ నేరుగా అధికారికంగా ఇన్ చార్జ్ లను ప్రకటించి, వాళ్లే అభ్యర్థులు అనే సూచన ఇస్తూ వుంటే గడబిడ జరుగుతోంది. ఆ గడబిడను తెలుగుదేశం క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. కానీ మరో పక్క తాను నేరుగా అభ్యర్ధులను ప్రకటించకుండా, తన మనోభావాలను ఒడిసి పట్టి ప్రకటించే పత్రికలో గ్యాసిప్ వార్తలుగా చలామణీలోకి తెస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి రాస్తున్న ఆ వార్తలు చూస్తుంటే అసలు జనసేనకు పాతిక సీట్లు అన్నా ఇస్తారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

లేటెస్ట్ గా ఈస్ట్ గోదావరి సీట్ల మీద వార్తలు వెలువడ్డాయి. పవన్ కు ఈస్ట్ గోదావరి లో కనీసం 7 సీట్లు ఇచ్చేస్తారని జనసేన శ్రేణులు నమ్మకంగా వున్నాయి. నిజంగా అన్ని సీట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఏమవుతుంది అనే అనుమానాలు కూడా వున్నాయి. కానీ పవన్  పార్టీకి మూలమైన కాపు సామాజిక వర్గ బలం గోదావరి జిల్లాల్లో ఎక్కువ కనుక ఇస్తారేమో అని అనుకునే వారు కూడా వున్నారు.

ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అనుకూల పత్రికలో జస్ట్ మూడు సీట్లు మాత్రమే గోదావరి జిల్లాల్లో జనసేనకు వదులుతారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తల ప్రకారం రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్ మాత్రమే జనసేనకు ఇస్తారు. ఇందులో రాజోలు గతంలో కూడా జనసేనదే. అంటే జస్ట్ రెండు సీట్లు ఇస్తారన్న మాట. కాకినాడ రూరల్ లో జనసేన పోటీ ఫిక్స్ అని నాలుగేళ్ల నుంచి వినిపిస్తోంది. కొత్తగా చేరిన పేరు రాజానగరం మాత్రమే. కానీ పిఠాపురం సీటు, ఇంకో సీటు కలిపి అయిదు ఇవ్వమని జనసేన కోరుతోందట. ఇస్తారా? లేదా చూడాలి. పోనీ రెండు అడిగినందుకు ఒకటి ఇచ్చినా, ఈస్ట్ లో నాలుగు సీట్లే అవుతాయి.

బలమైన ఈస్ట్ లోనే నాలుగు మించి ఇవ్వకుండా ఉత్తరాంధ్ర మొత్తం మీద ఎన్ని ఇస్తారు? వెస్ట్ లో ఎన్ని? అసలు పవన్ దృష్టి పెట్టని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇస్తారా? కృష్ణ పరిస్థితి ఏమిటి? చూస్తుంటే అటు చేసి, ఇటు చేసి పవన్ ను 22 సీట్లకు పరిమతం చేసి, ఓ నాలుగు సీట్లు భాజపాకు విదులుస్తారేమో? లేదా అంటే రెండిటినీ 30 కి పరిమితం చేస్తారేమో?

అదే జరిగితే జనసేన శ్రేణులు ఏ మేరకు ఆనందిస్తాయో, ఆగ్రహిస్తాయో? ఓట్ల బదిలీ ఏ విధంగా సాధ్యమవుతుందో చూడాలి.