యూపీఏ చైర్ పర్సన్ హోదాలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరిగా చలామణి అయిన నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు! సోనియా ప్రస్తుత వయసు 77 సంవత్సరాలు! అనారోగ్యంతో ఆసుపత్రికి తిరుగుతున్నారనే వార్తలూ వచ్చాయి ఒక దశలో! ఆమె వయసు రీత్యా రెస్టు తీసుకుంటోందనే ప్రచారమూ జరిగింది. అప్పుడప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వడం తప్ప యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా కనిపించడం లేదు! స్టేట్ మెంట్లు కూడా తరచూ ఉండవు! మరి ఈ వయసులో ఆమె రాజ్యసభకు నామినేట్ కావడం ఒక రకంగా హాస్యాస్పదం.
కేవలం ఎంపీ అనే హోదా కోసం ఆమె రాజ్యసభకు నామినేట్ అవుతున్నట్టుగా ఉంది కానీ, రాజకీయంగా సోనియా ఇప్పుడు పోరాడే పరిస్థితుల్లో లేరు! వయసు, ఆరోగ్యం ఆమెకు సహకరిస్తున్నట్టుగా లేవు. అందునా మోడీ వంటి ప్రత్యర్థిని ఎదుర్కొనేంత సీన్ సోనియాకు లేదని ఎప్పుడో స్పష్టం అయ్యింది. పదేళ్ల కిందట మోడీ ప్రధాని అయినప్పటి నుంచి సభలో కానీ, బయట కానీ సోనియా గట్టిగా మాట్లాడిన దాఖలాలు కూడా పెద్దగా లేవు! ఇలాంటప్పుడు మరొకరికి ఛాన్సు ఇవ్వకుండా సోనియా రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడం వారి అసమర్థతకు రుజువు కూడా!
అంతగా సభలో కొనసాగానుకుంటే.. మరోసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు! అయితే ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో గెలుపు పట్ల కూడా భయం పట్టుకున్నట్టుగా ఉంది. క్రితం సారి ఎన్నికల్లో రాహుల్ రెండు చోట్ల పోటీచేసి యూపీలో ఓడిపోయారు. మరి రేపు సోనియా యూపీ నుంచి ఇంకోసారి బరిలోకి దిగితే ఓటమి తప్పకపోవచ్చు! ఈ వృద్ధ సోనియాను ఆమె ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ప్రజలు కూడా ఎన్నుకుంటారనే నమ్మకాలు లేనట్టుగా ఉన్నాయి. అందుకే ఎంపీ హోదాలో కొనసాగడానికి, ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గడం పట్ల నమ్మకం లేక సోనియా రాజ్యసభకు నామినేట్ అవుతున్నారు!
చివరకు కాంగ్రెస్ బలం సోనియాను రాజ్యసభకు నామినేట్ చేసేంత స్థాయిలో అయినా ఉండటం ఆమెకు సంతోషాన్ని కలిగిస్తూ ఉండవచ్చు.