చిరంజీవి తాజా చిత్రం విశ్వంభర. గ్రాండ్ గా ప్రకటించడమే కాదు, అంతే ఘనంగా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ మూవీ కోసం జిమ్ లో కసరత్తులు కూడా షురూ చేశారు చిరంజీవి. అలా విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెట్టిన చిరంజీవి, ఇప్పుడా సినిమాకు స్వల్ప విరామం ప్రకటించారు.
తన అన్ని కార్యక్రమాల్ని పక్కనపెట్టి చిన్న హాలిడే తీసుకున్నారు చిరంజీవి. భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. యూఎస్ఏ నుంచి తిరిగొచ్చిన తర్వాత, వెంటనే విశ్వంభర షూటింగ్ స్టార్ట్ చేస్తానని కూడా ప్రకటించారాయన. పనిలోపనిగా అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓవైపు తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రముఖులకు టైమ్ ఇస్తూనే, మరోవైపు విశ్వంభర షూటింగ్ లో పాల్గొన్నారు చిరంజీవి. అలా కొన్ని రోజులుగా రెస్ట్ లేకుండా గడిపిన చిరంజీవి, ఇప్పుడు అమెరికా వెళ్లి కొన్ని రోజులు సేదతీరబోతున్నారు.
వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోంది విశ్వంభర సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కూడా సెట్స్ పైకొచ్చింది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లో 156వ చిత్రంగా తెరకెక్కుతోంది ఈ సోషియో ఫాంటసీ మూవీ.