నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేతలు పార్టీ మారుతున్నారనే ప్రచారం కొంత కాలంగా ఊపందుకుంది. నెల్లూరు, ఒంగోలు ఎంపీలైన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం వైసీపీలో ఆందోళన రేకెత్తిస్తోంది. అధికార పార్టీతో ఎప్పట్లాగే ఎల్లో మీడియా మైండ్ గేమ్‌కు తెరలేపింది.
ఈ నేపథ్యంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి మరోసారి మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ఏడాదిగా తనపై ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పారు.
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో చర్చలు జరిపానని, అయితే ఆయన తీవ్ర మనస్థాపం చెంది ఉన్నారని చెప్పుకొచ్చారు. తన ప్రయత్నాలేవీ ఫలించలేదని, ఇదే విషయాన్ని తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆదాల వెల్లడించారు. మాగుంట శ్రీనివాస్‌రెడ్డితో కూడా చర్చించానని, అయితే టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తనతో చెప్పారన్నారు. వైసీపీలోనే కొనసాగాలని మాగుంట ఉన్నట్టు ఆదాల వెల్లడించారు.
తనపై పార్టీ మారుతారనే ప్రచారం వృథా ప్రయాసగా ఆయన చెప్పారు. త్వరలో సీఎం వైఎస్ జగన్‌తో కలుస్తానని ఆదాల తెలిపారు. నెల్లూరు రూరల్ నుంచి ఆనం విజయ్‌కుమార్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. సీఎంను ఆనం కలిసినంత మాత్రాన నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని ఎలా అనుకుంటారని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు రూరల్‌లో పార్టీ విజయానికి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని సీఎం ఆదేశించి వుంటారని ఎందుకు అనుకోకూడదని ఆయన అన్నారు.