2 రోజుల కిందట హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ లో చాలామందికి ఈ పెళ్లి కార్డులు అంది ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ రకుల్ ఎవ్వరికీ పెళ్లి కార్డు ప్రింట్ చేసి ఇవ్వలేదు. ఆమె వ్యక్తిగతంగా అందర్నీ ఆహ్వానించడంతో పాటు, పెళ్లి కార్డ్ ను వాట్సాప్ చేసింది.
తన పెళ్లిని పర్యావరణానికి అనుకూలంగా (ఎకో ఫ్రెండ్లీ) జరుపుకోవాలని నిర్ణయించుకుంది రకుల్. ఇందులో భాగంగా పేపర్ వృధా చేయకూడదని నిర్ణయించుకొని, ఇలా డిజిటల్ పద్ధతిలో ఆహ్వానించింది.
కేవలం ఇది మాత్రమే కాదు, పెళ్లిలో కూడా ఎకో ఫ్రెండ్లీ పద్ధతులు చాలానే పాటించబోతోందట ఈ హీరోయిన్. పెళ్లి సందర్బంగా బాణసంచా కాల్చడం లేదు. ఈ విషయంలో రకుల్-జాకీ ఇద్దరికీ ఒకే మాట.
ఇక తన పెళ్లితో మరో సంప్రదాయాన్ని కూడా ప్రారంభించబోతోంది రకుల్. తన పెళ్లికి వచ్చిన ఆహుతులతో మొక్కలు నాటించాలని నిర్ణయించింది. ఈ మేరకు రిసార్ట్ లో ఏ ప్రాంతంలో, ఎవరు మొక్కలు నాటాలో కూడా డిసైడ్ అయింది.
మరో వారం రోజుల్లో గోవాలోని ఓ రిసార్ట్ లో పెళ్లి చేసుకోబోతోంది రకుల్. 21న జరగనున్న ఈ పెళ్లి కోసం సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ స్టార్ హోటల్ ను ముస్తాబు చేస్తున్నారు. 20-21 తేదీల్లో 2 రోజుల పాటు ఈ పెళ్లి గ్రాండ్ గా జరగనుంది.