రాజమౌళి సినిమా అనగానే ఫిక్స్ డ్ టీమ్ ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు కెమెరామెన్ ఎప్పుడూ ఫిక్స్. అయితే ఈసారి ఈ కూర్పులో భారీ మార్పు చోటుచేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి-మహేష్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ మారాడు.
మహేష్ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ తో కలిసి వర్క్ చేయబోతున్నాడు రాజమౌళి. ఇన్నాళ్లూ ఈ దర్శకుడి సినిమాలకు సెంథిల్ మాత్రమే వర్క్ చేశాడు. మగధీర, బాహుబలి-1, బాహుబలి-2, ఈగ.. ఇలా ఏ సినిమా తీసుకున్నా రాజమౌళి-సెంథిల్ కలిసి పని చేశారు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ కు కూడా సెంథిలే సినిమాటోగ్రాఫర్.
కానీ మహేష్ బాబు మూవీకి మాత్రం అతడు వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. దీనికి కారణాలేంటనేది స్పష్టంగా తెలియదు కానీ కెరీర్ పరంగా సెంథిల్, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
మహేష్ బాబు రీసెంట్ మూవీ గుంటూరుకారంకు పీఎస్ వినోద్ వర్క్ చేశాడు. ఈ మూవీతో పాటు అల వైకుంఠపురములో, సీతారామం లాంటి సినిమాలతో తన మార్క్ చూపించాడు. రాజమౌళితో కలిసి వర్క్ చేయడం ఇతడికి ఇదే తొలిసారి.
మరికొన్ని రోజుల్లో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఎప్పట్లానే ప్రెస్ మీట్ పెట్టి, రాజమౌళి ఈ సినిమా డీటెయిల్స్ వెల్లడించబోతున్నాడు. వేసవి తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సినిమాటోగ్రాఫర్ మినహా, ఇతర కీలక విభాగాల్లో పెద్దగా మార్పుచేర్పులు లేకుండానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.