ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతల చేపట్టినప్పటి నుంచి షర్మిల తన అన్న ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరికెళ్లి మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. షర్మిలకు రోజా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
నగరిలో నలుగురు మంత్రులున్నారని, ఇష్టానుసారం దోచుకుంటున్నారని మంత్రి రోజాతో పాటు ఆమె భర్త, ఇద్దరు అన్నలపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ రోజా మీడియాతో మాట్లాడుతూ తనదైన రీతిలో షర్మిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ఏమన్నారంటే…
“షర్మిలకు సవాల్ విసురుతున్నా. నా కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్నైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి దూరమవుతాం. నీ లాగా నేను వైఎస్సార్ బిడ్డ అని …చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదు. నేను రోజా. నా సొంత కష్టంతో ఎవరి మద్దతు లేకుండా సినిమాల్లోనూ, రాజకీయాల్లో ఎదిగాను” అని షర్మిలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
నగరి తన వూరు కాకపోయినా, సినిమాలు, టీవీ షోలు వదులుకుని, సేవ చేయాలనే తలంపుతో ఇక్కడికి వచ్చానన్నారు. ఆడబిడ్డ అయిన తనకు అన్నలతో పాటు భర్త అండగా నిలబడడం చాలా గొప్ప విషయమని రోజా అన్నారు. ఈ రోజు వరకూ తన వాళ్లు ఒక్క పదవి కూడా తీసుకోలేదన్నారు. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఎవరినీ బెదిరించలేదని, ఎక్కడా డబ్బు తీసుకోలేదన్నారు.
ఇన్ని రోజులు వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ అనే కారణంతో అందరూ గౌరవించారన్నారు. వైఎస్సార్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల కాంగ్రెస్‌లో చేరడాన్ని వైఎస్సార్ అభిమానులు తట్టుకోలేకున్నారన్నారు. జగన్‌ను 16 నెలల పాటు కాంగ్రెస్ సర్కార్ జైల్లో పెట్టడాన్ని వైఎస్సార్ అభిమానులెవరూ మరిచిపోలేదన్నారు. అలాంటి కాంగ్రెస్ నుంచి షర్మిలనే కాదు, ఎవరు మాట్లాడినా విలువ వుండదన్నారు.
కాంగ్రెస్ గొప్పదంటూనే, మళ్లీ వైఎస్సార్ బిడ్డనంటూ షర్మిల చెప్పుకుంటున్నారని వెటకరించారు. వైఎస్సార్ బిడ్డ అంటే జగన్మోహన్రెడ్డి అని ఆమె అన్నారు. తన తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు, ఆయన పేరును చిరస్థాయిగా ప్రజల్లో నిలిపేందుకు వైఎస్ జగన్ వైసీపీని స్థాపించారని ఆమె చెప్పుకొచ్చారు.
వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచేలా తన పార్టీని కాంగ్రెస్‌లో షర్మిల విలీనం చేశారని రోజా విరుచుకుపడ్డారు. ఏ లబ్ధి కోసం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇళ్లకు షర్మిల వెళ్లారని ఆమె నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో దూరి నీతులు చెబుతుంటే సామెతలు గుర్తుకొస్తున్నాయని షర్మిలను రోజా దెప్పి పొడిచారు.