ఇద్దరు సెలబ్రిటీలు ప్రేమించుకున్నప్పుడు చాలా అనుమానాలు తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ పై వచ్చిన పుకార్లు, ప్రియుడ్ని ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని దాటి రిలేషన్ షిప్ ను కొనసాగించడం చాలా కష్టమైన వ్యవహారం.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంది. డేటింగ్ మొదలుపెట్టడానికి ముందే తన ప్రియుడు జాకీ భగ్నానీకి ఫుల్ క్లారిటీ ఇచ్చానంటోంది రకుల్. అభద్రతాభావంతో ఇద్దరు వ్యక్తులు తమ రిలేషన్ షిప్ ను కొనసాగించలేరని, పరస్పరం నమ్మకం లేకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేరని తెలిపిన రకుల్.. తామిద్దరం డేటింగ్ కు ముందే అన్ని విషయాలు ఓపెన్ గా చర్చించుకున్నామని, ఎలాంటి రహస్యాలు దాచిపెట్టలేదని తెలిపింది.
భాగస్వామి అభద్రతాభావంతో ఉన్నప్పుడు బంధాన్ని కొనసాగించడం కష్టమని, అలాంటి అభద్రతాభావం లేకుండా జాకీకి తను పూర్తిగా అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చానని తెలిపింది రకుల్. జాకీతో మాత్రమే తను పరిపూర్ణంగా ఉంటున్నానని అంటోంది.
ఈ సందర్భంగా మిగతా హీరోయిన్లకు ఓ ఉచిత సలహా ఇస్తోంది రకుల్. ప్రస్తుతం సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేస్తున్న మహిళలంతా, కొంత అదనపు సమయాన్ని కేటాయించి, తమ కలలు-ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే మగాడి కోసం అన్వేషించాలని సూచిస్తోంది. అలాంటి భాగస్వామి దొరికినప్పుడు జీవితం మరింత అందంగా ఉంటుందని అంటోంది. ఈ నెలలోనే గోవాలో తన ప్రియుడు జాకీని వివాహం చేసుకోబోతోంది రకుల్.