నిర్మాత అనీల్ సుంకరకు ఈమధ్య కాలంలో తగిలిన ఎదురుదెబ్బల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏజెంట్ సినిమా ఆయన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో, భోళాశంకర్ సినిమా అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టింది.
ఇప్పుడీ నిర్మాత 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకొస్తున్నారు. ఈ సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్న సుంకర.. యూనిట్ లో అందరికంటే తనకే ఈ సినిమా సక్సెస్ అత్యవసరమని ఓపెన్ గా చెప్పుకొచ్చారు.
ఈసారి మాత్రం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నామని, అందుకే విడుదలకు 2 రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేస్తున్నామని ఎనౌన్స్ చేశారు. 'ఊరు పేరు భైరవకోన' సినిమాకు ఫిబ్రవరి 14 నుంచే పెయిడ్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతున్నాయి.
ఎన్నో భారీ సినిమాలు తీసిన అనీల్ సుంకర ఎప్పుడూ టెన్షన్ పడలేదు. కానీ 'ఊరు పేరు భైరవకోన' సినిమా విషయంలో చాలా టెన్షన్ పడ్డారట. దర్శకుడు కాపీ పంపించినా చూడ్డానికి టైమ్ తీసుకున్నారట. 'ఊరు పేరు భైరవకోన' సినిమా తన కెరీర్ కు చాలా కీలకమని అంగీకరించిన అనీల్.. దర్శకుడు చెప్పిన దానికంటే, సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయని మెచ్చుకున్నాడు.