Advertisement

Advertisement


Home > Politics - Analysis

మోడీ భజన అనివార్యం..అవశ్యం!

మోడీ భజన అనివార్యం..అవశ్యం!

ప్రధాని మోడీ ఇప్పుడు ఇండియా సూపర్ పవర్. ఇప్పుడేం కాదు. గత రెండు దఫాలుగా అలాగే వుంటూ, అంతకు అంతా పెరుగుతూ వచ్చారు. ఒకప్పుడు తనను అరెస్ట్ చేస్తా అన్న, తనకు అపాయింట్ మెంట్ ఇవ్వని, చంద్రబాబుతో 2014లో మోడీ కలిసి ఎన్నికలకు వెళ్లారు. నిజానికి అప్పుడే పక్కన పెట్టాలి. కానీ ఎందుకనో, ఎవరి ప్రోద్బలమో, వత్తిడో, మొత్తానికి కలిసి వెళ్లారు. చంద్రబాబు ఆ అవకాశం అందిపుచ్చుకున్నారు. ఆంధ్రలో భాజపా కు స్వంతగా గెలిచే సత్తా లేదు కానీ, గెలుస్తారు అనుకునేవారికి కాస్త బలం ఇవ్వగల విషయం అయితే వుంది. అది బాబుకు ఉపయోగపడింది.

కానీ అసలు మోడీ వ్యవహార శైలి ఏమటి అనేది 2014 నుంచి 2019 వరకు అర్థం అయ్యేసరికి మొహం మొత్తింది. కేవలం చంద్రబాబుకే కాదు, ఆయన మిత్రుడు పవన్‌కు కూడా. రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చారు అంటే భాజపా మీద ఎగిరారు. చంద్రబాబు కూడా తనకు భాజపా బంధం అవసరం లేదని దూరం జరిగారు. పవన్ డిటో డిటో. 2019లో అటు బాబు ఇటు పవన్ ఇద్దరూ షాక్ కు గురయ్యే పరిణామాలు వచ్చి, జగన్ సిఎమ్ అయ్యారు.

మోడీ వద్దనుకంటే జగన్ వచ్చాడు, ఈయన కన్నా మోడీనే బెటర్ అనుకున్నారేమో, ఆ వెంటనే పవన్ ఢిల్లీ వెళ్లి భాజపాతో చేయి కలిపి వచ్చారు.చంద్రబాబు ను భాజపాకు మళ్లీ దగ్గరకు చేసేందుకే పవన్ ఇలా వెళ్లింది అని అప్పట్లోనే వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ భాజపా అధినాయకత్వం ఈ నాలుగేళ్ల పాటు జగన్ తో మంచి సంబంధాలు నెరిపింది. అందువల్ల బాబుతో మరి కలవదు అని అంతా అనుకున్నారు. పురంధేశ్వ‌రిని భాజపా ఆంధ్ర నేతగా ఎంచుకున్నపుడు కూడా భాజపా ఇక చంద్రబాబుకు దగ్గర కాదు అనే అనుకున్నారు. కానీ పురంధేశ్వ‌రి స్వరం మారి, పదునుగా మారుతున్నపుడు అర్థం అయింది తేదేపా-భాజపా బంధం కలవడానికి ఎంతో కాలం పట్టదు అని.

ఇప్పుడు అదే జరిగింది. గెలిచినా ఓడినా జగన్ అనేవాడు మోడీకి దూరంగా జరగరు. ఎందుకుంటే ఆయన కేసుల భయం ఆయనకు వుండేనే వుంది. మోడీ మళ్లీ పవర్ లోకి వస్తారు. అందువల్ల జగన్ మోడీతోనే వుంటారు. కానీ మోడీ పవర్ లోకి రావడంతో కాస్త అటు ఇటు ఏమన్నా అయితే…? ఆ చాన్స్ కూడా తీసుకోవడానికి భాజపా ఇష్టపడడం లేదు. బెంగాల్ లో మమత ను కాంగ్రెస్ తెగ్గొట్టారు. బీహార్ లో డిటో డిటో. ఇక ఇప్పుడు ఆంధ్ర వంతు. చంద్రబాబు ప్రస్తుత కాంగ్రెస్ కూటమిలో లేరు. అయినా ఎందుకొచ్చింది. మోడీతో వుండాల్సిన ఆబ్లిగేషన్ కూడా లేదు. అందుకే ముందే దగ్గరకు తీస్తే సరిపోతుంది అని భాజపా నాయకత్వం అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీని వెనుక జగన్ బలహీనపడడం అనే ఆలోచన కూడా వుండి వుండొచ్చు.

మొత్తం మీద ఇన్నాళ్లూ మోడీని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం కేడర్ ఇప్పుడు మద్దతు మాటలు పలకాల్సి వచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని, రాజధాని రైల్వే లైన్ కు వెయ్యి రూపాయలు ఇచ్చారని అంటూ వస్తున్న వారు ఇప్పుడు ట్యూన్ మార్చాల్సి వుంది. అలా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పుకోవడానికి వీలుగా సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే తన పలుకులు ఈరోజు వండివార్చారు.

ఇందిర తరువాత బలమైన జాతీయ నాయకుడు మోడీ అని, ఆయనను ఢీ కొని మహా మహులే నానా బాధ పడుతున్నారని, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు పరిణామాలు కోట్ చేస్తూ, చంద్రబాబు ఇక తప్పకుండా మోడీతో వెళ్లాలని ఆర్కే వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. మోడీ నియంత అంటూ, కేంద్రం పక్షపాత ధోరణిని గతంలో ఎండగట్టిన ఆర్కే నే ఇప్పుడు మోడీనే శరణ్యం అని వివరించు కుంటూ వచ్చారు. అందువల్ల ఇక దేశం శ్రేణులు కూడా ఇక ఇదే పాట పాడాల్సి వుంటుంది. అలా పాడకపోయినా, వ్యతిరేక గళం అయితే వినిపించవు. అదే బాబు కు కావాల్సింది. అందుకే ఆర్కే రాసింది. అదే జరగాల్సింది. జరిగేది.

రాజకీయాలు అంటేనే ఏ రోటి దగ్గర ఆ పాట పాడడం. తప్పదు. తప్పు లేదు అనుకుంటూ సాగాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?