సినిమాలకు క్రేజ్ తీసుకురావడం కోసం మేకర్స్ కొత్తకొత్త ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పాన్ ఇండియా అనే ట్రెండ్ మొదలుపెట్టారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పార్ట్-2 ట్రెండ్ కూడా మొదలైంది. కాస్త బజ్ తో, భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలన్నింటికీ పార్ట్-2 ప్రకటించడం ఆనవాయితీగా మారిపోయింది.
నిజంగా కథలో అంత దమ్ముంటే పార్ట్-2 ప్రకటించొచ్చు, అందులో తప్పు లేదు కూడా. జనం కూడా కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తారు. గతంలో బాహుబలి పార్ట్-2 కోసం అలానే చూశారు. ఇప్పుడు పుష్ప-2, సలార్-2 కోసం కూడా అలానే చూస్తున్నారు.
కానీ ప్రతి సినిమాకు పార్ట్-2 ప్రకటించడం ఇప్పుడు పరిపాటిగా మారింది. మొన్నటికిమొన్న పెదకాపు సినిమాను 2 భాగాలుగా తీస్తున్నట్టు ప్రకటించారు. తీరాచూస్తే, మొదటి భాగమే ఫ్లాప్ అయింది. దీంతో రెండో భాగం ఊసెత్తలేదు.
స్కంద సినిమాకు కూడా పార్ట్-2 ఉందని చెప్పారు. సంక్రాంతికొచ్చిన సైంధవ్ కు కూడా సీక్వెల్ ప్రకటించారు. రీసెంట్ గా వచ్చిన ఈగల్ కు కూడా సీక్వెల్ ఉంటుందని క్లయిమాక్స్ లో ప్రకటించారు. ఈ సినిమాలకు రెండో భాగం వస్తుందంటే నమ్మగలమా..?
మరోవైపు నిజంగా సీక్వెల్ కోసం ఎదురుచూసే రేంజ్ ప్రాజెక్టులు కూడా తెరకెక్కుతున్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు పుష్ప-2, సలార్-2 కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. కల్కి, దేవర సినిమాలు కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ సినిమాకు కూడా జై హనుమాన్ పేరిట సీక్వెల్ రాబోతోంది. ఈ మూవీ కోసం కూడా ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.