యువగళం పాదయాత్ర ద్వారా గ్యాప్ తీసుకున్న నారా లోకేశ్ మళ్లీ జనంలోకి వెళ్లారు. శంఖారావం పేరుతో టీడీపీ శ్రేణుల్ని ఎన్నికల సమరానికి ఆయన సమాయత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఇవాళ ఆయన శంఖారావాన్ని పూరించారు.
లోకేశ్ ప్రసంగిస్తూ వైసీపీకి తన మార్క్ వార్నింగ్‌లతో టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. రెడ్ బుక్ చూసి అందరూ భయపడుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన అధికార పార్టీ నాయకులు, అధికారుల పేర్లన్నీ రెడ్ బుక్‌లో రాసుకున్నట్టు ఆయన చెప్పారు. వాళ్లందరిపై న్యాయ విచారణ జరిపి తగిన శిక్ష విధించేలా చేస్తామన్నారు. అలాగే అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబుతో పాటు తనపై కూడా ఎన్నో దొంగ కేసులు పెట్టారని ఆయన అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లే అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఉత్తరాంధ్రని జాబ్ కేపిటల్‌గా చేస్తే.. వైసీపీ ప్రభుత్వం గంజాయి క్యాపిటల్‌గా మార్చేసిందని మండిపడ్డారు. జగన్ సిద్ధం అంటావ్ … దేనికి సిద్దం? అని లోకేశ్ ప్రశ్నించారు. జైలుకి వెళ్లడానికి సిద్ధమా? సొంత బాబాయ్‌ని లేపేశారు.. ఇంకెంత మందిని లేపేయడానికి సిద్ధం? అని ఆయన నిలదీశారు.
మైథోమానియా సిండ్రోమ్ అనే జబ్బుతో జగన్ బాధపడుతున్నారని ఆయన వెటకరించారు. షర్మిల, సునీతలకే భద్రత లేదన్నారు. ఇక మన పరిస్థితేంటి? అని లోకేశ్ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు 3 వేలు అందిస్తామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన వ్యక్తి పవన్ అని ఆయన ప్రశంసించారు. వైసీపీ పేటీఎం బ్యాచ్‌తో జాగ్రత్తగా ఉండాలని లోకేశ్ సూచించారు. టీడీపీ – జనసేన మధ్య విభేదాలు వచ్చేలా చూస్తున్నారన్నారు. ఫేక్ పోస్ట్‌లతో టీడీపీ -జనసేన నేతలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.