రాజకీయాల్లో దిగజారుడుకు పరాకాష్ట చంద్రబాబు అంటే… టీడీపీ నేతలు సైతం అంగీకరించే పరిస్థితి. అయితే బాబు పతన విలువలకు వ్యూహం, చాణక్యం అనే ముద్దు పేర్లు పెట్టి, ఎల్లో మీడియా ఇంత కాలం జనాల్ని మభ్యపెడుతూ వచ్చింది. ప్రస్తుత సమాజంలో రాజకీయ చైతన్యం పెరిగింది. నాయకుల గురించి ఆయా పార్టీల అనుకూల మీడియా చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
ఏ నాయకుడు ఎందుకు రోజుకో సర్కస్ ఫీట్ వేస్తున్నాడో జనం వెంటనే చెప్పేస్తున్నారు. కానీ జనంలో వచ్చిన చైతన్యాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. తనను ఓడించడం జనం తప్పిదమని ఆయన బాహాటంగానే విమర్శించారు. చంద్రబాబు ఇంకా మారని మనిషని ప్రజలు గుర్తించారు. తన పాలనలోని ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని సమీక్షించుకోవాలన్న కనీస ఆలోచన కూడా ఇప్పటికీ చంద్రబాబులో లేకపోయింది.
ఇంకా ఏవో వ్యూహాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గద్దె దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కేవలం జగన్‌పై వ్యతిరేకత ఒక్కటే తమ కూటమికి అధికారం తెచ్చి పెడుతుందని ఆయన నమ్ముతున్నారు. అంతే తప్ప, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, తనను పాజిటివ్‌గా చూడాలని, తన పాలనలోని గొప్పతనాన్ని చెప్పి మరోసారి ఆదరించాలని కోరే ఉద్దేశం కనిపించడం లేదు. చంద్రబాబుకు ప్రత్యేకంగా రాజకీయ ప్రేమాభిమానాలు ఉండవు.
అధికారమే కేంద్రంగా ఆయన అడుగులుంటాయి. గత ఎన్నికల ముంగిట మోదీ సర్కార్‌పై జనంలో తీవ్ర వ్యతిరేకత వుందని, తనను మోసే తలమాసిన మీడియాధిపతి చెప్పడం, దాన్ని నమ్మి బీజేపీతో చంద్రబాబు కయ్యం పెట్టుకున్నారు. ఎన్నికల్లో తాను చావు దెబ్బతినడం, ఓడిపోతుందని ఆశించిన బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో బాబుకు భయం పట్టుకుంది. దేవుడికైనా దెబ్బే గురువు అనే చందంగా… మోదీ సర్కార్‌పై బాబు ఈ ఐదేళ్లలో నోరెత్తలేదు.
ఇప్పుడు ఎన్నికల్లో మోదీ సర్కార్ అవసరం ఏర్పడింది. గత ఎన్నికల్లో దేశం కోసం బీజేపీతో విడిపోయానని గొప్పలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఇదే దేశం కోసం అదే పార్టీతో అంటకాగడానికి సిద్ధమంటున్నారు. దేశమంటే తెలుగుదేశం అని నెటిజన్లు సెటైర్స్ విసురుతుండడాన్ని గమనించాలి. అసలు చంద్రబాబు ఏపీలో అరశాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి ఎందుకు సిద్ధమయ్యారనే ప్రశ్న సామాన్య జనం నుంచి వస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, సోషల్ మీడియా విస్తృతం అయిన నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ అడుగులను జనం జాగ్రత్తగా గమనిస్తున్నారు. దేశం, రాష్ట్రాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నామన్న చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల మాటల్ని ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు. అంతేకాదు, రానున్న ఎన్నికల్లో గెలుపు కంటే తనను తాను కాపాడుకోవడమే బాబుకు అత్యంత ప్రాధాన్య అంశమైందనే అభిప్రాయంలో జనం ఉన్నారు.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబును మరోసారి జైలుకు పంపడం ఖాయమని జనం చర్చించుకుంటున్నారు. బాబు తక్షణ కర్తవ్యం తనను తాను కాపాడుకోవడమే అని అనుకుంటున్నారు. ఎలాగూ మోడీ అధికారంలోకి వస్తారని, మళ్లీ కేసులు నడిస్తే జైలుకు పోవాల్సి ఉంటుందని బాబుకు తెలుసని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే తనతో పాటు కుమారుడైన లోకేశ్ ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని బాబు తపన పడుతున్నారు. అలాగే తనను నమ్ముకున్న ఆశ్రిత వర్గంలోని కొంతమంది ఆర్థిక, సామాజిక, రాజకీయ, మీడియా రంగాల్లోని తన ఆప్తుల్ని, వారి ఆస్తుల్ని కాపాడుకోవాలి. ఇవే బీజేపీతో బాబు పొత్తుకు ప్రాధాన్యత అంశాలు.
17ఎ తనకు రక్షణ ఇవ్వలేకపోయింది. ఎన్నికల తర్వాత ఎలాగైనా ఊచల బయట ఉండాలంటే ఒకటే మార్గం. తను గవర్నర్ లాంటి ఏదో ఒక రాజ్యాంగబద్ధమైన పదవి (అది ఎంత చిన్న రాష్ట్రానికైనా సరే) పొందాలి. అన్ని కేసుల నుండి ఇమ్యూనిటీ పొందాలి. ఇదే తాపత్రయం, ఇదే లక్ష్యం, ఇదే ఆయన ఆకాంక్ష!
తెలుగుదేశం కార్యకర్తలు, ఆ పార్టీని నమ్ముకున్న నాయకులు ఏమై పోయినా బాబుకు పట్టింపులేదు. ఇక జనసేన గురించి ఆయనకు ఆలోచనే వుండదు. కేంద్ర ప్రభుత్వ రక్షణలో శేష జీవితం గడపడమే ఆయనకు ఇప్పుడు తక్షణ అవసరం ! ఇంతకు మించి చంద్రబాబు దగ్గర వ్యూహమూ లేదు, చాణక్యమూ లేదు, బేరసారాలాడే శక్తీ లేదు !…ఇదీ జనాభిప్రాయం.
ప్రజల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చంద్రబాబు చెప్పడం అతిపెద్ద బూతు. ఆయన పోరాటం, ఆరాటం కేవలం తనను తాను కాపాడుకోవడానికే అన్నది చేదు నిజం.