టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో ఇరుపార్టీలు కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొనాలని తీర్మానించారు. అయితే ఇది ముణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం టీడీపీ యువ నేత నారా లోకేశ్ శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. శంఖారావం కార్యక్రమానికి సంబంధించి కేవలం టీడీపీ నేతలు, కార్యకర్తలే హడావుడి చేస్తున్నారు. జనసేన నేతలు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇచ్ఛాపురంలో సభ విజయవంతంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టి సారించారు. జనసమీకరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో ఎక్కడా జనసేన ప్రస్తావనే లేదు.
పొత్తు కుదిరిన మొదట్లో కొత్తగా పెళ్లైన జంట మాదిరిగా టీడీపీ, జనసేన నేతలు చెట్టపట్టాలేసుకుని తిరిగారు. రెండు నెలలు గడిచేసరికి మోజు తీరినట్టుంది. దీంతో టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇరుపార్టీల నేతల మధ్య సమన్వయం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య టికెట్ల వ్యవహారం నడుస్తోంది. దీంతో తమ నాయకత్వానికి జనసేన గండికొడుతోందనే ఆవేదన చాలా మంది టీడీపీ నేతల్లో వుంది.
క్షేత్రస్థాయిలో తగిన కేడర్ లేకపోయినా, పొత్తు పేరుతో టికెట్ దక్కించుకుని, తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారనే కోపం టీడీపీ నేతల్లో వుంది. దీంతో జనసేన నేతలతో చాలా నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లోకేశ్ శంఖారావం సభకు జనసేన నేతల్ని ఏ మేరకు కలుపుకెళ్లుతున్నారో వారికే తెలియాలి.
నిజానికి జనసేనతో పొత్తు లోకేశ్‌కు అసలు ఇష్టం లేదు. చంద్రబాబు ప్రోద్బలం వల్ల పవన్‌తో బాగుండడానికి లోకేశ్ నటిస్తున్నారు. అంతే తప్ప, రెండు పార్టీల మధ్య సరైన అభిప్రాయం లేకపోవడం వల్లే శంఖారావం సభకు జనసేనను కలుపుకెళ్లడానికి టీడీపీ నేతలు ఆసక్తి చూపడం లేదని సమాచారం.