కీల‌క స‌మ‌యంలో ప‌వ‌న్ ఎందుకిలా?

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరు సొంత పార్టీ నేత‌ల్ని కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మ‌యం అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌కు ఎంతో కీల‌క‌మైంది. ప్ర‌తి క్ష‌ణాన్ని…

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీరు సొంత పార్టీ నేత‌ల్ని కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మ‌యం అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌కు ఎంతో కీల‌క‌మైంది. ప్ర‌తి క్ష‌ణాన్ని ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు స‌ద్వినియోగం చేసుకోవాల్సి వుంటుంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కావాల్సినంత స‌మ‌యం వుంది. పార్టీ ప‌నులు త‌ప్ప‌, ఆయ‌న‌కు ఇంకో ప‌ని కూడా లేదు. రోజుకు మూడు నియోజ‌క‌వ‌ర్గాలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తారంటూ ఇటీవ‌ల జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు. గ‌త నెలాఖ‌రులో కూడా ప‌వ‌న్ క్షేత్రస్థాయి ప‌ర్య‌ట‌న‌లుంటాయ‌ని చెప్పారు. ఏవీ ఆచ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం లేదు. డిసెంబ‌ర్‌లో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. ఆ త‌ర్వాత పార్టీలో చేరిక‌ల సంద‌ర్భంలో మీడియాకు క‌నిపించారు. ఇంత‌కు మించి ప‌వ‌న్ కార్య‌క‌లాపాలేవీ లేవు.

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి తాజా షెడ్యూల్ వెలువ‌డింది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వ‌రకు భీమ‌వ‌రం, అమ‌లాపురం, కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంల‌లో ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తార‌ని జ‌న‌సేన రాజ‌కీయ కార్య‌ద‌ర్శి పి.హ‌రిప్ర‌సాద్ వెల్ల‌డించారు. పార్టీ ముఖ్యుల‌తో స‌మావేశాలుంటాయ‌ని వెల్ల‌డించారు. జ‌నంతో మ‌మేకం అవుతార‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు.

మూడు ద‌శ‌ల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న వుంటుంద‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. టీడీపీ నాయ‌కుల‌తో కూడా ఆయ‌న స‌మావేశం అవుతార‌ట‌. జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కుల‌తో మాట్లాడి ఎలా స‌మ‌న్వ‌యం చేసుకోవాలో ప‌వ‌న్ చెబుతార‌ట‌. ఇలాంటివన్నీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేస్తూ కూచుంటే ఎన్నిక‌ల ప్ర‌చారం ఎవ‌రు చేయాలో అర్థం కాని విష‌యం. ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలి చూస్తుంటే… ఏదో అయిష్టంగా, ఎవ‌రి కోస‌మో చేస్తున్న‌ట్టుగా వుంటోంది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌నంలోకి దూకుడు వెళ్లాల్సి వుంది. టీడీపీతో పొత్తు కుదుర్చుకోవ‌డంతో ఆయ‌న రిలాక్ష్ అవుతున్నార‌నే అనుమానం టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు క‌లుగుతోంది. టీడీపీ గెలిస్తే, త‌న పార్టీ నేత‌లు కూడా గెలుస్తారులే అనే ధీమాలో ప‌వ‌న్ ఉన్నారు. టీడీపీకి తాను బ‌లం అయ్యేలా జ‌నంతో క‌లిసిపోవ‌డం లేదు. ఇంకా స‌మ‌యం వుందిలే అని ఆయ‌న అనుకుంటున్నారు. ఈ ధోర‌ణే ఇరుపార్టీల నేత‌ల‌కు అస‌లు న‌చ్చ‌డం లేదు. రానున్న రోజుల్లో అయినా యాక్టీవ్ అవుతారేమో చూడాలి.