యాత్ర -2 అని మహీ వీ రాఘవ్ ప్రకటించగానే.. ఏముంది అంత తీయడానికి, మరీ భజన అయిపోతుంది, పెద్దతెరపై అతిగా భజన చేస్తూ చూసే అభిమానులకు కూడా ఎబ్బెట్టుగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే అలాంటేదేమీ లేకుండా, నిత్యం వార్తల్లో చూసిన అంశాలనే ఒక సినిమా పేర్చడంలో ఈ దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ప్రతిరోజూ కాకపోయినా వారానికి ఒకసారి పేపర్ చదివే వారికి కూడా గత 15 యేళ్ల రాజకీయ పరిణామాలు అంతా తెలిసినవే! వైఎస్ఆర్ మరణం, జగన్ సొంత పార్టీ, ఆ పై సీబీఐ కేసులు, 16 నెలల జైలు జీవితం, 2014 ఎన్నికల్లో ప్రతిపక్షవాసం, 2019 ఎన్నికల్లో ఘన విజయం, ఈ పదహైదేళ్లలో జరిగిన ఈ సంఘటనలనే ఒక సినిమాగా ఆసక్తికరంగా చూపించారు. తెలిసిన స్టోరీనే సినిమాగా చూస్తున్నా.. అది కూడా పూర్తి జగన్ వైపునే నిలబడి చూపించినా.. సినిమాను చాలా క్రిటికల్ గా చూసినా.. ఎక్కడా బోర్ కొట్టనీయకుండా, ఎక్కడా అతి చేయకుండా రూపకర్తలు తగు జాగ్రత్తలు వహించారు.
ఈ సినిమా టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానవర్గానికి పూనకాలు తెప్పించడం కూడా! 2019 ఎన్నికలకు ముందు యాత్ర విడుదల అయినా, 2024 ఎన్నికల వేళకు యాత్ర -2 తెర మీదకు రావడం అయినా.. రాజకీయ వ్యూహం కూడా కాదనలేని అంశం! యాత్ర 2 థియేటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమాన వర్గాలకు పూనకాలే వచ్చేస్తున్నాయి! జై జగన్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా లాభం చేకూర్చే అంశమే!
సరిగా వాడుకుంటే సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మాద్యమం అనేది కొత్తగా చెప్పనక్కర్లేదు, ఇప్పుడు మహీ వీ రాఘవ్ తీసిన సినిమా రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాంటి అస్త్రం దొరికింది. మరీ తీసికట్టుగా లేకపోవడం, చీప్ గా లేకపోవడం, హుందాగా.. చెప్పాలనుకున్న అంశాన్ని ఎమోషనల్ గా సూటిగా, హత్తుకునేలా చెప్పడం, జగన్ రాజకీయ ప్రయాణాన్ని స్ఫూర్తివంతంగా చెప్పడం, 2014 ఎన్నికల ఓటమిని కూడా రొమాంటిసైజ్ చేయడం.. చాలా వ్యూహాత్మకంగానే ఈ సినిమాను తెరకెక్కించి సరిగ్గా సమయం చూసి ప్రజల మధ్యకు వదిలారు!
ఇంతకు ఏడాది కిందటో, జగన్ 2024 ఎన్నికల్లో గెలవగానే ఇలాంటి సినిమా వచ్చి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే ప్రయోజనం కన్నా ఎన్నికల ముందు రావడంతో దక్కగల ప్రయోజనం ఎక్కువ! మరి ఈ సినిమా చూసేసి ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తారని ఎవ్వరూ అనలేరు! అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు, అభిమానగణానికి కిక్ ఎక్కించడంలో మాత్రం యాత్ర 2 పూర్తిగా సఫలం అవుతోంది.
ఈ సినిమా గురించి ఇంగ్లిష్ మీడియా రివ్యూలను చూసినా, ఓవరాల్ రివ్యూలను చూసినా.. బాగుందనే మాటే వస్తోంది. ఈ పాజిటివ్ వైబ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా నిలిచే అంశాలు, ఒకవేళ జగన్ ప్రభుత్వంపై విపరీతమైన స్థాయి వ్యతిరేకత ఉండి ఉన్నా.. ఇలాంటి సినిమాలు అన్ని వైపుల నుంచి దాడులను ఎదుర్కొనాల్సి వచ్చేది కూడా!
2019 ఎన్నికల ముందు కథానాయకుడు, మహానాయకుడు సినిమాల విషయంలో అదే జరిగింది. ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలనే ప్రయత్నంలో ఆయన చిన్న కుమారుడు బాలకృష్ణ పరువు తీశారు! ఎన్టీఆర్ పాత్రను తనే చేసి.. ఎన్టీఆర్ ఏంటి బాలకృష్ణలా ఉన్నాడని అనిపించుకోవడంతో పాటు.. ఎన్టీఆర్ ను మానవాతీతుడిగా చూపే ప్రయత్నంలో అభాసుపాలయ్యారు. సర్వం ఎన్టీఆర్ కు అనుకూలంగా చూపే ప్రయత్నంలో.. రకరకాల వ్యక్తుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.
ఎన్టీఆర్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో అర్ధసత్యాలను, అసత్యాలను కూడా ఆపాదించారనే విమర్శలు వచ్చాయి. అవన్నీ ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ బయోపిక్ తొలి పార్ట్ కమర్షియల్ గా తీసినా.. కాసులు సంపాదించుకోలేదు, ఇక రెండో పార్ట్ ను పట్టించుకున్న నాథుడు లేడు! ఎన్టీఆర్ ఎదుగుదలను ఆయన తనయుడే సినిమా తీసి పరువు తీశాడనే అపఖ్యాతి వచ్చింది! అప్పటి పొలిటికల్ మూడ్ కు కూడా అదొక తార్కాణంగా నిలిచింది.
తన సత్తా ఏమిటో తెలియాలంటే ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్ చూడాలన్నట్టుగా చంద్రబాబే చెప్పుకున్నా.. ఆ సినిమా ఆడలేదు! యాత్ర, యాత్ర 2 లకు విపరీతమైన కలెక్షన్ల రాకపోయినా.. కోట్ల రూపాయల సినిమాలు కాకపోయినా.. డబ్బు కన్నా అవి చేరాలనుకున్న టార్గెట్ ను చేరుకుంటున్నాయని మాత్రం స్పష్టం అవుతోంది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానవర్గాల్లో ఎన్నికల మూడ్ ను యాత్ర 2 సమర్థవంతంగానే తీసుకెళ్తోంది!
-హిమ