ఉమ్మడి విశాఖ జిల్లాతో సంబంధం లేని వారు నాగబాబు. ఆయన మెగా ఫ్యామిలీకి చెందిన వారు. అనూహ్యంగా ఆయన అనకాపల్లి ఎంపీ బరిలోకి దూసుకుని వచ్చారు. దాని వెనక ఎవరి వ్యూహాలు ఎత్తుగడలు ఉన్నాయో తెలియదు కానీ నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తారు అని అంటున్నారు.
నాగబాబు ఈ సడెన్ ఎంట్రీతో ఇద్దరు మాజీ మంత్రులకు ఒకే సారి షాక్ తగులుతోంది అని అంటున్నారు. అయిదేళ్ల అజ్ఞాత వాసం వీడి అన్నీ ఆలోచించి జనసేనలో చేరిన వారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. ఆయన చట్టసభలకు నెగ్గి రెండు దశాబ్దాల కాలం పూర్తి అవుతోంది. చివరి సారిగా 2004లో కాంగ్రెస్ టికెట్ మీద అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
వైఎస్సార్ మంత్రివర్గంలో అయిదేళ్ల పాటు మంత్రిగా కీలక శాఖలను చూసిన కొణతాల 2009 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. నాటి నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన 2019లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేద్దామని చూసినా కుదరలేదు.
ఈసారి పోటీకి దిగి తన రాజకీయాన్ని గౌరవప్రదంగా ముగిద్దామని కొణతాల చూస్తున్నారు. ఆయన జనసేన నుంచి ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అయితే నాగబాబు పోటీ చేస్తారు అని వార్తలు రావడంతో ఆయన అభిమానులు కలవరం చెందుతున్నారు. దీని మీద కొణతాల మాట్లాడుతూ తనకు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎక్కడ నుంచి పోటీ చేయమన్నా చేస్తాను అని చెప్పారు. అలా కాదు పార్టీ పని చేయమన్నా చేస్తాను అని కూడా అనేశారు.
మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈసారి తన కుమారుడిని రాజకీయ వారసుడిగా చూసుకోవాల్సిందే అని పట్టుదలగా ఉన్నారు. ఇటీవల మాడుగుల వచ్చిన చంద్రబాబుకే ఆయన ఎంపీ టికెట్ మీద అర్జీ అందించారు. ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నది అయ్యన్న అనుచరులలో కూడా బలంగా ఉంది. అయ్యన్న ఏడు పదులకు చేరువలో ఉన్నారు.
తాను రాజకీయంగా లైం లైట్ లో ఉండగానే కుమారుడు పొలిటికల్ ఎంట్రీ సజావుగా సాగిపోవాలని చూస్తున్నారు. నాగబాబు కూటమి అభ్యర్ధి అంటే మాత్రం అయ్యన్నకు భారీ షాక్ అని అంటున్నారు. ఈ పరిణామాలను ఆయన ఎలా అర్ధం చేసుకుంటారు అన్నది కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు. అసలే ఫైర్ బ్రాండ్ గా పేరున్న అయ్యన్న కుమారుడి రాజకీయ భవితవ్యం కోసం ఎలా పావులు కదుపుతారు అన్నది కూడా ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.