అక్కడ రెండుగా చీలిన జనసేన?

పెందుర్తి జనసేనలో వర్గ పోరు సాగుతోంది అని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి వారిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ ని కన్ ఫర్మ్…

పెందుర్తి జనసేనలో వర్గ పోరు సాగుతోంది అని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి వారిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ ని కన్ ఫర్మ్ చేస్తున్నారు. దాంతో పార్టీకి గత అయిదేళ్లుగా పనిచేస్తూ సొంత ఖర్చు పెట్టి మరీ అన్ని రకాలుగా కృషి చేసిన మరో వర్గం రగిలిపోతోంది.

జనసేన ఆశయాలు నచ్చి తనకు ఉన్న మంచి ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి వచ్చారు తమ్మిరెడ్డి శివశంకర్. ఆయన మంచి వక్త. అంతకంటే మంచి విశ్లేషకుడు. ఏ అంశం మీద అయినా సమర్ధంగా మాట్లాడే నేర్పు ఆయన సొంతం. ఆయన పార్టీని నిలబెడుతూ పెందుర్తి నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు.

జనసేన నుంచి 2019లో పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆ తరువాత వైసీపీలో చేరిపోయారు దాంతో పెందుర్తి పార్టీని శివశంకర్ సొంత డబ్బులు పెట్టి నడుపుతూ వచ్చారని అంటున్నారు. ఆయనకు తీరా ఎన్నికల వేళ టికెట్ ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన పంచకర్లకు కేటాయించడం వల్ల ఆయన వర్గం రగులుతోంది అని అంటున్నారు.

పార్టీ రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పదవితో పాటు పెందుర్తి బాధ్యతలు కూడా రమేష్ బాబుకు జనసేన పెద్దలు అప్పగించారు. అయితే మొదటి నుంచి పార్టీతో ఉన్న‌ శివశంకర్ వర్గాన్ని కలుపుకుని పోకుండా రమేష్ బాబు వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. దీంతో పెందుర్తి జనసేన రెండు వర్గాలుగా చీలిపోయింది అని అంటున్నారు.

పంచకర్ల పార్టీతో సంబంధం లేని వారితో ఉంటున్నారని కేవలం తన వాళ్లనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు అని రెండవ వర్గం అంటోంది. నాగబాబు పెందుర్తి పర్యటనకు వచ్చిన వేళ వర్గ పోరు ఆయన కళ్ల ముందు కనిపించింది. నాగబాబు పర్యటనకు వస్తే పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన శివశంకర్ ఎక్కడా కనిపించలేదు అంటున్నారు. అసలు ఆయనకు నాగబాబు పర్యటన గురించి తెలియచేయలేదని కూడా అంటున్నారు.

అసలే పెందుర్తిలో టీడీపీ నుంచి ఎంతమేరకు సహకారం జనసేనకు దక్కుతుంది అన్న ప్రశ్నలు ఉన్నాయి. ఇపుడు సొంత పార్టీలో కూడా వర్గ పోరు ఉంది. దాంతో దీనిని పరిష్కరించకపోతే మాత్రం ఇబ్బందే అంటున్నారు.