మామూలుగా ఏ సినిమాకైనా సమీక్షలు వస్తాయి. రాసేవారి అభిరుచిని, అభిప్రాయాలను అవి ప్రతిబింబిస్తాయి. ఇదంతా కామన్. అయితే వైఎస్ జగన్ బయోపిక్ యాత్ర 2 వరకు వచ్చే సరికి కొన్ని తెలుగుదేశం అను ‘కుల’ మీడియాలు సమీక్షలు మాని పొలిటికల్ వ్యాసాలు వండి వార్చడం విశేషం.
సినిమా సమీక్షలో కథ మంచి చెడ్డలు అన్నది ఓ భాగం మాత్రమే. ఇంకా దర్శకుడి వర్క్, సాంకేతిక అంశాలు, నటీనటులు ఇవన్నీ కూడా వుంటాయి. కానీ ఈ కుల మీడియాకు అవన్నీ పక్కకు పోయాయి. కేవలం షర్మిల పాత్ర లేదు, వివేకా మర్డర్ కేసు లేదు, ఇంకోటి లేదు.. ఇంకోటి లేదు అంటూ రాసుకువచ్చారు.
ఏ నాయకుడికైనా కొన్ని గ్యాసిప్ లు వుంటాయి. కొన్ని చీకటి కోణాలు వుంటాయి. వాటిని ఎవరూ బయోపిక్ లోకి తీసుకురారు. ఎన్టీఆర్ మీద బోలెడు గ్యాసిప్ లు వున్నాయి. రాత్రుళ్లు చీరకట్టుకుని పూజ చేసేవారని, ఓ హీరోయిన్ కుమార్తెతో వివాహం చేసుకుని పూజలు చేసారని అవన్నీ కథనాయకుడు-మహానాయకుడు సినిమాల్లోకి వచ్చాయా? అన్నింటికి మించి లక్ష్మీపార్వతి వివాహ ప్రకటన, వివాహం, ఆమె పాత్ర, ఆమెను ఇంటి నుంచి గెంటేయడం, ఎందరు కొడుకులన్నా, ఆమెతో వివాహం ముందు ఎన్టీఆర్ ఒంటరి బ్రతుకు బతకాల్సి రావడం ఇవన్నీ సినిమాలోకి తీసుకువచ్చారా?
అంతెందుకు వెన్నుపోటుకు ముందు డాల్ఫిన్ హోటల్ లో రహస్య సమావేశాలు, ఆ తరువాత వైస్రాయ్ గొడవల వెనుక దాగిన నికార్సయిన నిజాలు సినిమాలోకి తెచ్చారా? మరి ఆ రోజు కదలని కలాలు ఇప్పుడు ఇలా సమీక్షల పేరిట పొలిటికల్ వ్యాసాలు వండి వారుస్తున్నారేమీ?
మడమ తిప్పని జగన్ అని సినిమాలో అన్నారు, ఫలానా హామీ నెరవేర్చలేదు కదా అని సమీక్షలో పేర్కొనడం ఎంత వరకు సబబు. దాన్ని సమీక్ష అనరు. రాజకీయ వ్యాసం అంటారు.
సినిమా వరకు సినిమా ఎలా వుందో సమీక్షించి, ఆపైన, ఇది ఆఫ్ బేక్డ్ ప్రొడెక్ట్ అని లేదా కాయిన్ కు వన్ సైడ్ మాత్రమే అని చెప్పి వుంటే సబబుగా వుండేది.
రాయాల్సిందంతా రాజకీయ వ్యాసంలా సమీక్షలు రాసేసి, చివర్న నటనలు బాగున్నాయి, టేకింగ్ బాగుంది, మేకింగ్ క్వాలిటీ బాగుంది. సంగీతం బాగుంది, ఎలివేషన్లు బాగున్నాయి అని ముక్తాయించడం అనేది సమీక్ష ధర్మం ఎలా అవుతుందో, రాసే వాళ్లకే తెలియాలి.
కేవలం తమకు కిట్టని పార్టీ, కిట్టని నాయకుడు అనే ఆలోచన తప్ప సమీక్షల వెనుక మరోటి కనిపించకుండా వుందంటే, అంతేలే అనుకోవాలేమో?