హిట్ కొట్టిన తరువాత వ్యవహారం వేరు. డిజాస్టర్ ఇచ్చిన తరువాత వ్యవహారం వేరు. స్కంధ సినిమా తరువాత దర్శకుడు బోయపాటికి నిర్మాతలు రెడీగా వున్నారు కానీ హీరోలు దొరకడం లేదు. ఆయనకు అచ్చి వచ్చిన హీరో బాలయ్య ఎన్నికల మూడ్ లో వున్నారు.
గీతా సంస్ధలో సినిమా చేయాల్సి వుంది కానీ హీరోలు దొరకడం లేదు. బన్నీతో సినిమా చేయాలన్నది బోయపాటి కోరిక. కానీ బోయపాటి చేత గీతా సంస్థకు ఓ సినిమా చేయించాలన్నది బన్నీ ఆలోచనగా వుంది.
బాలయ్య అఖండ 2 సినిమాను గీతాకు సెట్ చేయాలని బోయకు వుంది కానీ బాలయ్య దగ్గర కుదరడం లేదు. ఆయన 14 రీల్స్ కే అంటూ ఫిక్స్ డ్ గా వున్నారు. ఇక ఎవరు మిగిలారు. తమిళ హీరో సూర్య. గీతా సంస్థ దగ్గర డేట్ లు వున్నాయి కానీ రెడీగా కాదు. అందుకే విజయ్ దేవరకొండ ను ముందుకు తీసుకువచ్చారు అల్లు అరవింద్ అని తెలుస్తోంది.
కానీ బోయపాటి రొటీన్ మాస్ సినిమాలు తీస్తారనే ప్రచారం వుండడంతో విజయ్ దేవరకొండ అంత ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. కానీ అల్లు అరవింద్ అడగడంతో ఇప్పుడు కథ వినడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో, ఎల్లుండో విజయ్ కథ వింటారని తెలుస్తోంది. కథ విన్నాక నచ్చితే సినిమా వుండొచ్చు. కానీ విజయ్ చేతిలో ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి సినిమా ఒకటి వుంది.