టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు చర్చనీయాంశమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి అమిత్‌షా, నడ్డాలతో చర్చించారు. అయితే పొత్తుపై చర్చల ఫలితాలను మాత్రం ఇరు పార్టీల అగ్రనేతలు వెల్లడించకపోవడం గమనార్హం. దీంతో పొత్తు వుంటుందా? వుండదా? అనే చర్చకు తెరలేచింది. బీజేపీతో పొత్తుపై టీడీపీ నేతలు ఆసక్తిగా లేరు. పొత్తు వల్ల రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువనే భావన టీడీపీ నేతల్లో వుంది.
కానీ చంద్రబాబు మనసులో ఏముందో సొంత పార్టీ నేతలకు కూడా తెలియదు. ఈ నేపథ్యంలో పొత్తుపై బీజేపీ సీనియర్ నేత, చంద్రబాబు శ్రేయోభిలాషి అయిన సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై ఏం చర్చించారో ఇంకా తమ పార్టీ అగ్రనాయకులు చెప్పలేదన్నారు. ఇరుపార్టీల మధ్య సానుకూల వాతావరణం వుండడం వల్లే పొత్తు కుదుర్చుకునేందుకు ముందుకొచ్చాయన్నారు.
పొత్తుపై బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసే వరకూ తామేమీ మాట్లాడమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే కూటమి పటిష్టంగా వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వుందన్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ కంటే ఒకట్రెండు సీట్లు ఎక్కువే రావచ్చని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రత్వం ఉండవన్నారు. గతంలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలని సుజనాచౌదరి తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ అగ్రనేతలు కలిసి పని చేయాలని అనుకుని వుంటారని ఆయన చెప్పారు. ఎన్డీఏ నుంచి విడిపోవద్దని ఆ రోజు తాను చెప్పానని సుజనా గుర్తు చేశారు.