టీడీపీ యువ నాయకుడు లోకేశ్ ‘వ్యూహం’ బెడిసి కొట్టింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు లోకేశ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమను కించపరిచేలా, ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్‌ను ఆకాశానికెత్తుతూ వర్మ వ్యూహం సినిమా తీశారనేది లోకేశ్ ఆరోపణ, ఆవేదన.
వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చినా, న్యాయ స్థానాల ద్వారా అడ్డుకోవాలని నారా లోకేశ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో వ్యూహం సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు.
వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. దీంతో వ్యూహం సినిమా నిర్మాత సదరు తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. మరోసారి సినిమా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని బోర్డును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి వ్యూహం సినిమాను సెన్సార్ బోర్డు వీక్షించింది.
యూ సర్టిఫికెట్ జారీ చేస్తూ సెన్సార్ బోర్డు ఇవాళ నిర్ణయం తీసుకుంది. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగినట్టైంది. ఈ నెల 16న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. లోకేశ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సినిమాలో చంద్రబాబునాయుడు, లోకేశ్‌లపై నెగెటివిటీ నింపే సీన్స్ వున్నాయనేది టీడీపీ ఆరోపణ. లోకేశ్ అడ్డగింతతో సినిమాకు మరింత పబ్లిసిటీ కల్పించినట్టైంది. లోకేశ్ అడ్డుకునే ప్రయత్నాలు అంతిమంగా వర్మ కోరుకున్నట్టుగా సినిమా ప్రమోహన్‌కు ఉపయోగపడ్డాయి.