అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. రానున్న ఎన్నికల్లో గెలిచేదెవరో, చట్టసభలో అడుగు పెట్టేదెవరో తెలియాలంటే మే నెలలో ఫలితాల కోసం ఎదురు చూడక తప్పదు.
వైసీపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో అసెంబ్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో తన భార్యను కించపరిచేలా అధికార పక్ష సభ్యులు మాట్లాడారంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు బహిష్కరించి వెళ్లారు. తిరిగి ముఖ్యమంత్రి హోదాలోనే చట్టసభలో అడుగు పెడతానని ఆయన శపథం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి స్పీకర్‌గా నాల్గో వ్యక్తిగా పని చేసే అదృష్టం దక్కిందన్నారు.
నిష్పక్షపాతంగా పని చేసేందుకు ప్రయత్నించినట్టు ఆయన తెలిపారు. అయితే చట్టసభలో తాను బాధితునిగా మిగిలానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు విపక్ష సభ్యుల ప్రవర్తనే కారణమని ఆయన చెప్పడం గమనార్హం. ప్రతిపక్ష సభ్యుల విమర్శల్ని ఓపికగా భరించానన్నారు. విపక్ష సభ్యుల ప్రవర్తన తనను బాధించిందని, బాధితుడిగా మిగిల్చిందని ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు.
తన విధుల నిర్వహణలో ప్రతిపక్ష సభ్యులు అడ్డంకులు సృష్టించారన్నారు. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనతో శాసనసభ స్థాయిని తగ్గించారని ఆవేదనతో చెప్పారు.