ఈ నెల 27న జరగనున్న రాజ్యసభ సభ్యుల ఎన్నికకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు జాక్‌పాట్ కొట్టారు. పాయకరావుపేట టికెట్ నిరాకరించిన సీఎం జగన్, అంతకు మించి పెద్ద పదవికే ఎంపిక చేయడం విశేషం. ఏకంగా గొల్ల బాబూరావును అత్యున్నత పెద్దల సభ రాజ్యసభకు పంపడానికి నిర్ణయించారు. గొల్ల బాబూరావుతో పాటు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలను వైసీపీ బరిలో దింపడానికి నిర్ణయించింది.
వీరిలో మేడా రఘునాథరెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి సోదరుడు. ఈ దఫా మల్లిఖార్జునరెడ్డికి రాజంపేట టికెట్ దక్కలేదు. అక్కడ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక వైవీ సుబ్బారెడ్డి విషయానికి వస్తే గతంలో ఒంగోలు ఎంపీగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇచ్చి, వైవీని పక్కన పెట్టారు. తనకు టికెట్ ఇవ్వలేదని కొంత కాలం వైవీ అలిగినప్పటికీ, ఆ తర్వాత పార్టీ కోసం పని చేశారు. నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్‌గా శ్రీవారి సేవలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్.
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని చూస్తే… ఆ పార్టీకి సులువుగా దక్కాలి. అయితే అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో కొందరు వైసీపీకి దూరమయ్యారు. కొందరు సిటింగ్‌లకు టికెట్ నిరాకరించడం, మరికొందరిని ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేసినా, ఇష్టపడక పార్టీకి దూరమయ్యారు.
ఉదాహరణకు తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంలను ఎంపీ టికెట్లను సీఎం జగన్ ఇచ్చారు. పోటీ చేసేందుకు వీళ్లిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో ఆదిమూలం టీడీపీ వైపు, జయరాం అజ్ఞాతంలోకి వెళ్లారు. వీళ్లిద్దరూ వైసీపీకి ఓట్లు వేస్తారనే నమ్మకం లేదు. అలాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ తదితర ఎమ్మెల్యేలకు కూడా జగన్ టికెట్లు నిరాకరించారు. వీళ్ల నిర్ణయం ఎలా వుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
అలాగే నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది. రేపోమాపో స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీ కూడా అభ్యర్థిని బరిలో నిలుపుతుందనే ప్రచారం నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.