ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ పర్యటన ప్రత్యర్థుల్లో టెన్షన్ కలిగిస్తోంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జగన్ శుక్రవారం భేటీ కానున్నారు. అందుకే ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు చంద్రబాబు బుధవారం అమిత్‌షాతో చర్చించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీతో చర్చలపై టీడీపీ, ఎల్లో మీడియా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
ఒకప్పుడు అమిత్‌షా, మోదీలతో చంద్రబాబు భేటీ అంటే ఎల్లో మీడియా, టీడీపీ విపరీతంగా ప్రచారం చేసుకునేవి. కానీ ఈ దఫా అలాంటి అత్యుత్సాహం మచ్చుకైనా కనిపించడం లేదు. బీజేపీతో పొత్తు వల్ల రాజకీయంగా నష్టపోతామనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఇతరేతర ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాము అనుకున్నట్టు బీజేపీ ఎంత వరకు సహకరిస్తుందనే అనుమానం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన వెనుక మర్మం ఏమై వుంటుందనే చర్చకు తెరలేచింది. కనీసం ఒకరోజు కూడా గ్యాప్ లేకుండానే జగన్‌ను ప్రధాని మోదీ, అమిత్‌షా ఢిల్లీకి పిలిపించుకోవడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వదలిచారనే చర్చకు తెరలేచింది. రాజకీయంగా టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నా, జగన్‌తో మాత్రం ఎప్పట్లాగే స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామనే సంకేతాలు ఇవ్వడానికే జగన్‌ను ఢిల్లీకి పిలిచారా? అనే చర్చకు తెరలేచింది.
ఈ పరిణామంపై టీడీపీ ఆగ్రహంగా వుంది. ఒకవైపు జగన్‌తో సన్నిహితంగా వుంటూనే, తమతో పొత్తు కుదుర్చుకుని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు తీసుకుని నష్టపరచడానికేనా? అనే అనుమానం టీడీపీ నేతల్లో లేకపోలేదు. ఎలాంటి ప్రచారం లేకుండానే జగన్ తనకు కావాల్సిన పనుల్ని కేంద్రంలో చక్కదిద్దుకుంటున్నారనే అక్కసు టీడీపీ నేతల్లో వుంది. అయినా బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంటుందా? అనేదే చర్చ.