Advertisement

Advertisement


Home > Movies - Reviews

Yatra 2 Review: మూవీ రివ్యూ: యాత్ర-2

Yatra 2 Review: మూవీ రివ్యూ: యాత్ర-2

చిత్రం: యాత్ర-2
రేటింగ్: 3/5
తారాగణం: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణ్
కెమెరా: మది
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
నిర్మాత: శివ మేక
రచన-దర్శకత్వం: మహి వి రాఘవ్
విడుదల: 8 ఫిబ్రవరి 2024 

2019లో వచ్చిన "యాత్ర"కి ఇది సీక్వెల్. అది వైఎస్సార్ సీఎం అవడంతో ముగిస్తే, ఈ "యాత్ర-2" వైఎస్సార్ మరణంతో మొదలై జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో ముగుస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కనుక ఈ సినిమాలో ఏముందో అనే దానికంటే ఎలా ఉందో అనేదే చెప్పుకోవాలి. 

జగన్ మోహన్ రెడ్డి జీవితం 2009 వరకు సాఫీగా సాగిపోయింది. చెప్పుకోవడానికి, రాయడానికి పెద్ద డ్రామా ఉన్న జీవితం కాదు అప్పటి వరకు. కానీ తన జీవితంలో అసలు సిసలు డ్రామా తండ్రిపోవడంతో మొదలై.. ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ సామ్రాజ్యంపై తిరుగుబాటు, సొంత పార్టీ పెట్టడం, జైలు జీవితం, నాయకుడిగా ఎదగడం, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం అనే డ్రామా ఉంది. అది సినిమాకి కావాల్సిన సరుకు. "మహానటి" సినిమా కూడా సావిత్రి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండడం వల్లనే మంచి బయోపిక్ గా మలచడానికి సాధ్యపడింది. అన్ని జీవితాలు సినిమాలుగా తీయడానికి పనికిరావు. కానీ జగన్ మోహన్ రెడ్డి జీవితం మాత్రం పైన చెప్పుకున్న అంశాల వల్ల సినిమాకి పూర్తిగా పనికొచ్చే కథ. కనుక సరైన కథని దర్శకుడు సమర్ధవంతంగా తెర మీదకి తీసుకొచ్చాడా లేదా అనేది పరిశీలిద్దాం. 

2009లో వైయస్సార్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి నడుం కట్టడం, దానిని సోనియా గాంధీ ఆపమనడంతో సినిమాలో కాన్-ఫ్లిక్ట్ పాయింట్ మొదలవుతుంది. ఎంత చెప్పినా, ఎలా చెప్పినా, ఎవరి చేత చెప్పించినా, తానే స్వయంగా చెప్పినా కూడా జగన్ ఆ యాత్రని ఆపడు. పర్యవసానంగా ఆమె జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ ఉచ్చుని బిగించడం, ఈ వాతావరణాన్ని చంద్రబాబు తన రాజకీయానికి వాడుకోవడం జరుగుతుంది. 

ఈ రాజకీయ చదరంగంలో ఎన్ని అవమానాలు ఎదురైనా, జైలు జీవితం పలకరించినా, చంద్రబాబులాంటి చాణక్యుడి జిత్తులకి దెబ్బతింటున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, తెగింపుతో, ప్రజల్నే నమ్ముకుని జగన్ ఎలా విజయం సాధించాడనేది కథ. 

అంటే.. ఇందులో ప్రధాన ప్రతినాయకపాత్రలు రెండు- సోనియా గాంధీ, చంద్రబాబు. సోనియా పాత్రని మాత్రం ఆద్యంతం "మేడం" అనే పేర్కొనడం జరిగింది. చంద్రబాబు పేరుని మాత్రం యథాతధంగా వాడేసారు. తన రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు ప్రోగ్రెస్ (కాంగ్రెస్ కి పెట్టిన మారుపేరు) పార్టీని ఎలా వాడుకున్నాడు, తన ప్రత్యర్ధిగా జగన్ ఎదగకుండా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసాడు అనేవి డీటైల్డ్ గా చూపకపోయినా ఉద్దేశ్యాల్ని మాత్రం తేటతెల్లం చేసింది ఈ స్క్రిప్ట్. 

అలాగే పార్టీని నమ్మున్న వారికి, పార్టీ కోసం నిస్వార్ధంగా పని చేసిన వారిని జగన్ మోహన్ రెడ్డి ఎలా గుర్తిస్తాడు అనేది నందిగామ సురేష్ పాత్రతో చెప్పడం జరిగింది. అది ఈ చిత్రంలో ఒక హైలైట్ సీన్.. (అయితే సెల్యూట్ కొట్టించడం కూడా చూపించుంటే ఇంకా బాగుండేది). 

అలాగే ప్రధమార్థంలో కొడాలి నాని వచ్చి వైఎస్సార్ ని కలవడం, ఆ సమయంలో వైఎస్సార్ కలెక్టరుతో ఫోనులో చెప్పే డైలాగ్ హాల్లో చప్పట్లు కొట్టిస్తాయి. 

అదే సన్నివేశంలో వైఎస్సార్ అప్పటి తెదేపాకి చెందిన కొడాలి నానితో, "సాయం అడిగిన వాడు ప్రత్యర్థి అయినా కూడా నేను అతని బాగు కోరతాను. మీ నాయకుడిలా ప్రత్యర్థుల నాశనం కోరుకోను" అంటాడు.

మరొక చోట ఒక మహిళ జగన్ తో, "దేవుడు కేవలం నమ్మకం అన్నా! వై.ఎస్.ఆర్ నిజం" అంటుంది. 

ఇలాంటి డైలాగ్స్ సహజంగానే ప్రేక్షకుల్లోని వైకాపా అభిమానులకి నచ్చుతాయి. 

కొన్ని సింబాలిక్ సీన్స్ బాగా పండించాడు దర్శకుడు. ముఖ్యంగా వైఎస్సార్ మరణానంతరం జగన్ ఒక పాత కారులో కూర్చుని భార్యతో చెప్పే డైలాగులు రచయితలోని పరిణితికి నిదర్శనం. చెప్పబోయే కథకి నాందిప్రస్తావనలాగ ఉంది ఆ సీన్. 

ఇక ఇంకా బాగ తీసుంటే బాగుండేది అనే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ రచ్చబండ ప్రయాణానికి ఒక రాత్రి ముందు జరిగే సన్నివేశాలు కాస్తంత భావోద్వేగాన్ని కలిగిస్తాయి. కానీ అటుపిమ్మట ఆ ఎమోషన్ ని నిలబెట్టడమో, పెంచడమో చేయకుండా సాధారణంగా నడిపాడు దర్శకుడు. 

టెక్నికల్ గా సినిమా బాగుంది. పాటల్లో "చూస్తున్నావా నాన్నా" స్లోగా ఉన్నా ఎమోషన్ పండించింది. మిగిలిన పాటలు మాత్రం తేలిపోయాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి పెట్టిన పాట పవర్ఫుల్ గా లేదు. కెమెరా వర్క్, ఎడిటింగ్ బాగున్నాయి. 

నటీనటుల్లో జీవా తన మెథడ్ యాక్టింగుతో చక్కగా చేసాడు. ఎక్కడా జీవా కాకుండా జగన్ మోహన్ రెడ్డే కనిపించాడు.

మమ్ముట్టి ఆల్రడీ "యాత్ర" చేసాడు కనుక అదే పాత్రని అంతే ఈజ్ తో కొనసాగించాడు. 

చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్ కి ఎలివేషన్ సీన్లు బానే ఉన్నాయి. సుజానె బెర్నెట్ కి సోనియా పాత్ర కొత్తేమీ కాదు. ఆమె గతంలో "ది యాక్సిడెంటల్ ప్రైం మినిష్టర్"లో ఇదే పాత్ర పోషించింది. 

విజయమ్మగా ఆశ్రిత వేములగంటి, భారతిగా కేతకి నారాయణ్ పర్వాలేదు. "రెడ్డి జి" గా పిలవబడే శుభలేఖ సుధాకర్ పాత్ర రియాలిటీలో ఎవరో తెలియలేదు. 

సినిమా నిడివి రెండు గంటల పది నిమిషాలు. స్క్రీన్ ప్లే వేగంగా కదులుతూ త్వరగా ముగుస్తుంది. ప్రధమార్ధమంతా వైఎస్సార్ మరణం, ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర, సోనియా అతనిని డిస్ట్రాయ్ చేయమనడంతో ముగుస్తుంది.

ద్వితీయార్థమంతా జగన్ జైలుపాలు కావడం, ఎన్నికల బరిలో పోరాడడం.. మొదట తాను గెలిచి ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడంతో చివరికొస్తుంది. ఆ తర్వాత శుభలేఖ సుధాకర్ గొంతులో వినిపించే వాక్యాలు జగన్ మోహన్ రెడ్డి ఇమేజుని పైస్థాయికి తీసుకెళ్తాయి.

"వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అనే నేను.." అంటూ ఒరిజినల్ జగన్ మోహన్ రెడ్డి తెర మీద కనిపించడంతో రోలింగ్ టైటిల్స్ పడతాయి.  

మొత్తంగా చూసుకుంటే వైఎస్సార్-జగన్ ల అభిమానులకి నచ్చే చిత్రమిది. తెలిసిన చరిత్రనే సినిమా రూపంగా తెర మీద చూసే అవకాశమిది. వైకాపా శ్రేణులతో పాటూ సాధారణ ప్రజల్లో జగన్ పాలన పట్ల సానుకూలత ఉన్నవాళ్లకి భావోద్వేగం కలిగిస్తుంది. ప్రతిపక్షపార్టీల సానుభూతిపరులు ఈ చిత్రం దరిదాపుల్లోకి కూడా రారు. వచ్చినా పెదవి విరవడం సహజం. 

అలా రాజకీయ చిత్రంగా కాకుండా తటస్థ దృష్టితో చూస్తే కనుక ఇది ఒక స్ఫూర్తిదాయకమైన చిత్రం. భయపడని గుణం, తెగింపు, కష్టపడి పని చేయడం-ఎంతటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండడం, ప్రత్యర్ధి బలవంతుడైనా సొంత బలాన్ని తక్కువ అంచనా వేసుకోకపోవడం, ఆడిన మాట తప్పకపోవడం, పితృవాక్యపరిపాలన లాంటి గుణాలు కలిగిన వ్యక్తి ఎంతటి కొండనైనా పిండి చెయగలడని చెప్పే కథ ఇది. ఆ రకంగా ఇది అందరూ చూడాల్సిన వ్యక్తిత్వవికాస చిత్రం. 

బాటం లైన్: స్ఫూర్తిదాయకం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?